తెలంగాణలో పేదలకు చెందిన అసైన్డ్ భూములు ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు, మంత్రిపదవి నుంచి భర్తరఫ్‌తో... ఈటల రాజేందర్ తన భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని ఎండగడుతున్న ఈటల... హుజూరాబాద్‌లోని తన అనుచరులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. జిల్లా నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు.... తమ నాయకునికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎన్ఆర్ఐలతోనూ ఆన్‌లైన్‌లో సమావేశమై.... వారి సూచనలు స్వీకరించారు. '
ఆచితూచి
కార్యకర్తల నుంచి లభిస్తున్న అభయం మేరకు ఈటల.... భవిష్యత్ కార్యాచరణపై ఆచితూచి అడుగులేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో తొలి నుంచి కష్టపడిన తమ నాయకున్ని వేధించడం తగదంటూ ఈటల అనుచరులు విమర్శలు గుప్పిస్తున్నారు. తమ పదవులకు రాజీనామా చేసి.... పార్టీపై ఒత్తిడి తెస్తామని కొందరు ప్రజాప్రతినిధులు చెబుతుండగా... ఈటల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం, హుజూరాబాద్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన మాజీమంత్రి... తన శ్రేయోభిలాషులతో భేటీ కానున్నారు.
సరైన పద్ధతి కాదు
అసైన్డ్‌భూముల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటలపై తెరాస నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రులు ఈటల తీరుపై తీవ్రవిమర్శలు చేశారు. తాజాగా సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతరావు.... ఈటల తీరును తప్పుబట్టారు. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఉన్న వ్యక్తి.... తన తప్పును కప్పి పుచ్చుకోవడానికి ప్రజల వద్దకు రావడం సరైన పద్ధతి కాదన్నారు. అవినీతి పట్ల కఠినంగా వ్యవహరించే కేసీఆర్ నిర్ణయం సరైందేనని ఆయన పేర్కొన్నారు. పార్టీలో తనకు జరిగిన అన్యాయం చెబుతుండగానే... తెరాస నేతలు ఎదురుదాడి చేయటం... వరసగా తన అనుచరులతో ఈటల భేటీ అవుతుండటంతో ఆయన భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది..
ఇదీ చదవండి: అత్యధిక క్రీయాశీల కరోనా కేసుల్లో 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్