ప్రభుత్వ పథకాలు పొందడంలో బయోమెట్రిక్ వ్యవస్థ కారణంగా వేలిముద్రలు తప్పని సరిగా వేయాల్సి ఉంది. జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో వేలిముద్రల వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఓ వైపు అధికారులు, వాలంటీర్లు, మరోవైపు లబ్ధిదారులు సైతం దీనిపై ఆందోళన చెందుతున్నారు. ఒకటో తేదీన రేషన్, పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. మరోవైపు స్వయం సహాయక సంఘాల సభ్యుల ధ్రువీకరణ కోసం వెలుగు సిబ్బంది, ఇళ్ల స్థలాలు మంజూరైన వారికి ఇంటి రుణం కేటాయించేందుకు వీలుగా వాలంటీర్లు, లబ్ధిదారుల వివరాలతో పాటు వేలిముద్రల సేకరణ ప్రక్రియ చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ స్థిరాస్తుల విక్రయాలకు సంబంధించి బయోమెట్రిక్ వేయడం అనివార్యమైంది. బాపులపాడు మండలం వేలేరులో ఒక రేషన్ డీలర్ కుటుంబం మొత్తానికి కరోనా సోకడం, వారిలో ఒకరు చనిపోవడం కలకలం రేపింది. దీంతో గ్రామంలో ప్రత్యేకంగా ఐమాస్క్ బస్సు ఏర్పాటు చేసి రేషన్ తీసుకున్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ఒకేచోట వందల సంఖ్యలో జనం ఇలా గుమికూడడం, వారి చేతులు పట్టుకుని రేషన్ డీలర్లు, వాలంటీర్లు, తదితర సిబ్బంది వేలిముద్రలు వేయించాల్సి రావడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వస్థాయిలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: