కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే క్రమంలో రిజర్వు బ్యాంకు రాష్ట్రాలకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సు పరిమితి పెంచింది. దీనివల్ల రాష్ట్రానికి కొంత ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఈ పరిమితి 1500 వేల కోట్లుగా ఉంది. తాజా నిర్ణయం వల్ల అది 2400 కోట్లకు పెరగనుంది. ఏప్రిల్ ఒకటిన 30 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోగా శుక్రవారం దాన్ని 60శాతానికి పెంచింది. 2020 మార్చి నెలాఖరుకు ఉన్న పరిమితిపై ఈ పెంపు వర్తిస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. ఓవర్ డ్రాఫ్టును వినియోగించుకునే రోజుల సంఖ్యలోనూ మార్పులు చేసింది.
ఒక నెలలో ఓవర్ డ్రాఫ్టు వెసులుబాటును ప్రతి రాష్ట్రం 14 రోజుల పాటు వినియోగించుకునే ఆస్కారం ఉండేది. అది ప్రస్తుతం 21 రోజులకు పెంచారు. ప్రతి మూడు నెలల్లో ప్రస్తుతం 36 పనిదినాలు ఓవర్ డ్రాఫ్టు వినియోగానికి ఆస్కారం ఉండగా ప్రస్తుతం ఆ పరిమితిని 50 రోజులకు పెంచారు. రిజర్వు బ్యాంకు నాబార్డుకు 25వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించడంతో రాష్ట్ర వ్యవసాయ రంగానికి మరింత రుణ వెసులుబాట్లు లభించే అవకాశం ఉంది. ప్రస్తుత ఖరీఫ్, రబీ కాలాల్లో లక్షా 10 వేల కోట్ల రుణ లక్ష్యంగా ప్రణాళిక అమలు చేస్తున్నారు. సూక్ష్మ ఆర్థిక సంస్థలకు 50 వేల కోట్ల ప్యాకేజీ వల్ల రాష్ట్రంలోని 98వేలకు పైగా ఉన్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. జాతీయ గృహ నిర్మాణ బ్యాంకుకు ఆర్థిక సాయం చేయడం వల్ల నిర్మాణదారులకు రుణ వెసులుబాటు పెరుగుతుంది.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కరోనా విజృంభణ - శుక్రవారం ఒక్కరోజే 38 కేసులు