రాళ్ల దాడి ఘటనపై తుళ్లూరులో రైతులు, మహిళల ఆందోళన కొనసాగుతోంది. ఉద్దండరాయునిపాలెంలో రాళ్ల దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని తుళ్లూరు దీక్షా శిబిరంలోని వారంతా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. రాత్రి నుంచి రహదారిపైనే రైతులు, మహిళలు నిరసన తెలిపారు. 3 రాజధానుల శిబిరం తొలగించే వరకూ ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెప్పారు.
ఈ ఉద్రిక్త పరిస్థితులతో.. తుళ్లూరులో భారీగా పోలీసులు మోహరించారు. నేడు రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తామని రైతులు తెలిపిన మేరకు.. భద్రత విషయంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
'ప్రభుత్వ సహకారంతో ఆందోళన చేసే వారితో తన్నులు తినాలా?'
తుళ్లూరులో రోడ్డుపై ఆందోళన విరమించాలని డీఎస్పీ జగన్నాధం.. రైతులను కోరారు. దీక్షా శిబిరంలో ఆందోళన చేసుకోవాలన్నారు. ఆ సూచనను తోసిపుచ్చిన రైతులు.. తమ ప్రాణాలకు పోలీసులే భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. డీజీపీ వచ్చి హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేదిలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ సహకారంతో ఉద్యమం చేసే వారితో కూడా తన్నులు తినాలా? అని ప్రశ్నించారు. తమ భూముల్లో వారికి ధర్నా చేసేందుకు అనుమతి ఎలా ఇచ్చారని పోలీసులను రైతులు నిలదీశారు.
ఇదీ చదవండి: