ఆలయాల నుంచి సర్వశ్రేయోనిధి (సీజీఎఫ్) కింద తీసుకునే సొమ్మును పురాతన ఆలయాల పునరుద్ధరణకు మాత్రమే వినియోగించాలని నిబంధనలున్నా.. కొత్త జిల్లాల్లో ఏర్పాటైన జిల్లా దేవాదాయశాఖ అధికారి కార్యాలయాల మరమ్మతులు, వాటిలో ఫర్నిచర్ కొనుగోలుకు వినియోగించేలా ఆదేశాలివ్వడం విమర్శలకు తావిస్తోంది. ఒక్కో కార్యాలయానికి కనిష్ఠంగా రూ.3 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.8.50 లక్షల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.63.5 లక్షలు వెచ్చించేలా కమిషనరేట్ అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. వీటిని వివిధ ఆలయాల నుంచి తీసుకొని, అవి సీజీఎఫ్ కింద చెల్లించే మొత్తం నుంచి మినహాయించేలా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. వాస్తవానికి దేవాదాయశాఖ పరిధిలోని రూ.2 లక్షలపైన ఆదాయం ఉన్న ఆలయాలు, మఠాలు, సంస్థలు తదితరాలు సెక్షన్-70 ప్రకారం తమ రాబడిలో 9 శాతం సీజీఎఫ్‌కి జమ చేస్తాయి. వీటిని పురాతన ఆలయాల పునరుద్ధరణకు, దూపదీప నైవేద్యాలు, అర్చకుల జీతాల కింద మాత్రమే వినియోగించాల్సి ఉంది. దానికి విరుద్ధంగా ఇప్పుడు ఆదేశాల్విడం గమనార్హం. గతంలో కూడా దేవాదాయ శాఖ అధికారుల కార్యాలయాల మరమ్మతులకు, ఇతర నిర్మాణాలు, వాహనాల కొనుగోళ్లు, తదితరాలకు ఈ నిధులు వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆ ఉత్తర్వుల్లో....
అనకాపల్లిలోని కార్యాలయానికి నూకాలమ్మ అమ్మవారి ఆలయం నుంచి రూ.6 లక్షలు, పాడేరులో విశాఖ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి రూ.3 లక్షలు, పార్వతీపురంలో విజయనగరం పైడితల్లి అమ్మవారు, అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయాల నుంచి రూ.5 లక్షలు, కాకినాడలో పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం నుంచి రూ.3 లక్షలు, అమలాపురంలో వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి రూ.5 లక్షలు, భీమవరంలో మావుళ్లమ్మ అమ్మవారి ఆలయం నుంచి రూ.6 లక్షలు, మచిలీపట్నంలో మోపిదేవి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయం నుంచి రూ.8.50 లక్షలు, నరసరావుపేటలో మహంకాళి ఆలయం నుంచి రూ.4 లక్షలు, బాపట్లలో పెదకాకాని ఆలయ నిధుల నుంచి రూ.5 లక్షలు, నంద్యాలలో మహానంది ఆలయ నిధుల నుంచి 5 లక్షలు, పుట్టపర్తిలో కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ నిధుల నుంచి రూ.6 లక్షలు, రాయచోటిలో వీరభద్రస్వామి, నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయాల నుంచి రూ.5 లక్షలు, తిరుపతిలోని కార్యాలయానికి శ్రీకాళహస్తి ఆలయ నిధులు రూ.3 లక్షలు ఖర్చు చేసేలా ఆదేశాలిచ్చారు.
ఇదీ చదవండి: ఆ ఉద్యోగులకు రోజులో మూడుసార్లు హాజరు .. నేటి నుంచే అమలు