పాఠశాల హాజరును నేటి నుంచి ఉపాధ్యాయులు యాప్ ద్వారానే నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు మినహా మిగతా వారంతా యాప్ ద్వారానే హాజరు నమోదు చేయాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. బోధనేతర సిబ్బందికీ మినహాయింపులేదని తేల్చిచెప్పింది. మాన్యువల్ అటెండెన్సును పరిగణనలోకి తీసుకోబోమని...కేవలం చూపులేని దివ్యాంగులకు మాత్రమే వెసులుబాటు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆండ్రాయిడ్ ఫోన్లు లేని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది.. ప్రధానోపాధ్యాయుడు ఫోన్లను వినియోగించుకోవాలని సూచించింది. ఐతే ఫేస్ ఆధారిత హాజరు నమోదు యాప్ డౌన్‌లోడ్‌కు.. ఉపాధ్యాయ సంఘాలు నిరాకరిస్తున్నాయి. వ్యక్తిగత డేటా భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం తినే పిల్లల హాజరు, మరుగుదొడ్ల శుభ్రత, విద్యాకానుక, ‘నాడు-నేడు’పనుల వివరాలను టీచర్లు సొంత ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌ల్లో నమోదు చేస్తున్నారు. ఇదే తమకు భారమని, మళ్లీ కొత్త యాప్ డౌన్‌లోడ్ తమ వల్ల కాదని ఉపాధ్యాయులు తేల్చిచెప్తున్నారు.
"మేం గతంలో కూడా చెప్పాము. ఈ యాప్‌ను మా ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోమని. మా ఉపాధ్యాయులకు దీనిపై అనేక సందేహాలున్నాయి. వ్యక్తిగత డేటాకు ఇబ్బంది చెబుతున్నా అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారు. అయినా మేము దీనిని బహిష్కరిస్తున్నాం. ఈ విధానం సరైందికాదు. ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలిగితే వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలిగానీ... 'మేము పాలసీ చేశాము, మీరు దాన్ని కచ్చితంగా అమలు చేయాలి' అనే అధికారులు వైఖరిని మేము ఖండిస్తున్నాం" -మంజుల, ఫ్యాప్టో సెక్రటరీ జనరల్
యాప్ ఆధారిత హాజరు నమోదుపై ప్రభుత్వం తొలుత ఆగస్టులోనే మార్గదర్శకాలు జారీ చేసినా...ఉపాధ్యాయులు వ్యతిరేకించడంతో మంత్రి బొత్స గత నెల 18న వారితో చర్చలు జరిపారు. కానీ అవి ఫలించలేదు. ఉదయం 9గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా సెలవు నిబంధన తొలగిస్తామని...15రోజులు ఈ-హాజరుపై శిక్షణ ఇస్తామని మంత్రి వారికి నచ్చజెప్పారు. ప్రభుత్వమే డివైజెస్ కొనుగోలు చేసి ఇవ్వాలంటే దాదాపు 200 కోట్లు ఖర్చవుతుందని.. వివరించారు. ఐతే.. ఉపాధ్యాయులు మాత్రం హాజరు పరికరాలను ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
"ఏ యాప్‌ను కూడా అప్లోడ్ చేయకుండా సహరించకుండా ప్రభుత్వం వ్యవహరించే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొస్తోంది. ఇది ప్రభుత్వానికి మంచిది కాదు. తెగేదాకా లాగుతోంది. అధికారులు కూడా మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయులపై దాడి, తప్పుడు కేసులు, కట్టుకథలు అల్లి కేసులు పెడుతున్న వైనాన్ని కూడా మేము ఖండిస్తున్నాం." -పాండు రంగారావు, ఉపాధ్యాయ సంఘాల నాయకుడు
నేడు మంత్రితో జరిగే చర్చల ఆధారంగా క్షేత్రస్థాయిలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇవీ చదవండి: