పోలవరం ప్రాజెక్టుపై 2022 వరకు రాష్ట్రప్రభుత్వం 14వేల 336 కోట్లు ఖర్చు చేసిందని... కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడూ తెలిపారు. కేంద్రం ఇప్పటి వరకు ప్రాజెక్టుకు 12 వేల 311 కోట్లు విడుదల చేసిందని స్పష్టం చేశారు. తర్వాత 437 కోట్ల రూపాయలు చెల్లింపు కోసం పోలవరం ప్రాజెక్టు అథారిటీ బిల్లులు పంపినట్లు తెలిపారు. ఈ నెల 17న వైకాపా సభ్యులు లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. 2019 ఫిబ్రవరిలో జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సాగు నీరు, వరద నియంత్రణ, బహుళార్థ సాధక ప్రాజెక్టుల సలహా కమిటీ సమావేశం జరిగింది.
ఇందులో పోలవరం ప్రాజెక్టు అంచనాలను 2017-18 నాటి ధరల ప్రకారం 55 వేల 549 కోట్లకు సవరించామని మంత్రి తెలిపారు. ఆ తర్వాత అంచనాల సవరణ కమిటీ 2020 మార్చిలో ఈ ప్రాజెక్టు వ్యయాన్ని 2013-14 ధరల ప్రకారం 29 వేల 027 కోట్లకు 2017-18 ధరల ప్రకారం 47 వేల 725 కోట్లకు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. 2020 డిసెంబరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరించిన అంచనాల పెట్టుబడుల అనుమతుల కోసం ప్రతిపాదనలను సమర్పించినట్లు చెప్పారు. అయితే పోలవరం ప్రాజెక్టు అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని అంశాలకు సంబంధించిన సమాచారం కోరినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: నాటుసారా మరణాలపై జగన్ చెప్పేవన్నీ అసత్యాలే: అచ్చెన్న