ఏడు జిల్లాల ఎక్సైజ్ అధికారులతో ఆ శాఖ మంత్రి నారాయణస్వామి సమీక్ష నిర్వహించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల డీసీలు, ఏసీలు, డీఎంలతో ఆయన భేటీ అయ్యారు. బెల్టు షాపుల నియంత్రణ, మద్యం ఔట్లెట్ల నిర్వహణపై చర్చించారు. కొందరు అధికారులే బెల్టు షాపులను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్టు షాపులను ప్రోత్సహిస్తోన్న నరసరావుపేట ఎక్సైజ్ సీఐ భుజంగరావును సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి బార్లకు మద్యం సరఫరా చేశారనే ఆరోపణలు నిర్ధారణ అవ్వడం వల్ల సీఐని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇదే అంశంపై గుంటూరు జిల్లా డీసీ ఆదిశేషుకు ఛార్జ్ మెమో జారీ చేయాలన్నారు. రెండు రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎక్సైజ్ సీఐ, ఎస్ఐని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. మద్యపాన నిషేధంలో భాగంగా కొత్త చట్టాన్ని అమలు చేయాలని సూచించారు.
అవకతవకలకు పాల్పడిన అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. సూపర్వైజర్, సేల్స్‌మెన్, వాచ్మెన్లకు ఏజెన్సీల ద్వారా జీతాలు సక్రమంగా ఇవ్వాలన్నారు. ఐడీ, ఎన్డీపీఎల్ కేసుల్లో పీడీ యాక్ట్ అమలు చేయాలని ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా వాహన యజమానులపై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : 'మూడు రాజధానుల ప్రతిపాదనను అడ్డుకోండి'