hidden treasures: జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తూ పోలీసులకు పట్టుబడిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. తనకల్లు మండలంలోని బైరాగి గుడి పరిసరాలలో మెటల్ డిటెక్టర్ల సాయంతో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్న ఇద్దరిని తనకల్లు పోలీసులు అరెస్టు చేశారు. నల్లచెరువు మండలానికి చెందిన రామ్ శెట్టి, బెంగళూరుకు చెందిన సలీంకు స్థిరాస్తి వ్యాపారం ద్వారా పరిచయం ఏర్పడింది. ఇటీవల కాలంలో స్థిరాస్తి వ్యాపారం మందగించడంతో, వీరిద్దరి దృష్టి గుప్తనిధుల అన్వేషణపై పడింది. మెటల్ డిటెక్టర్లతో భూమిలోని ఖనిజాలను గుర్తించవచ్చని సలీం.. రామ్ శెట్టికి వివరించారు. మెటల్ డిటెక్టర్లను వాడుతూ... సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి గుప్త నిధుల తవ్వకాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా తనకల్లు సమీపంలోని బైరాగి గుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నట్లు స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గుడి సమీపంలో తవ్వకాలు చేస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకొని, వారి నుంచి ద్విచక్ర వాహనంతో పాటు, మొబైల్ ఫోన్లు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: