ఏకగ్రీవాలైన స్థానాల్లో అభ్యర్థులకు ధ్రువపత్రాలు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో... ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యవహారం తెరపైకి వచ్చింది. హైకోర్టు తీర్పు దృష్ట్యా ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. న్యాయపరమైన అవరోధాలు తొలగిపోయినందునా... ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికలను రద్దు చేయాలని కోరుతున్నాయి. ఎన్నడూ లేని రీతిలో అత్యధిక స్థానాల్లో రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఏకగ్రీవాలయ్యాయని... అధికార దుర్వినియోగం చేసి వైకాపా అక్రమాలకు పాల్పడిందని అప్పట్లో పలు పార్టీలు ఆరోపించాయి.
ఇదే అంశాన్నీ న్యాయస్థానానికి ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికలు రద్దు చేయాలని జనసేన పార్టీ హైకోర్టులో వేసిన పిటిషన్ ఇంకా విచారణలో ఉంది. పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పునకు ముందు, తర్వాత ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ ప్రకటన చేయలేదు. న్యాయస్థానంలో సందిగ్ధం తొలగేవరకు ఎన్నికలు నిర్వహించలేమని ఎస్ఈసీ ఇటీవల స్పష్టం చేశారు. ఈనెల 18న మేయర్ల ఎన్నిక నిర్వహంచిన అనంతరం... 22 నుంచి 24 వరకు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఎల్టీసీపై తీర్థయాత్రకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనే సందిగ్ధత నెలకొంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు గతేడాది మార్చి 7న నోటిఫికేషన్ జారీ అయ్యింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసి పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారైన తర్వాత కరోనా కారణంగా మార్చి 15న ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా వ్యాప్తి తగ్గి పురపాలక ఎన్నికలను నిర్వహించినా... న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల ఎన్నికల ప్రక్రియను ఎస్ఈసీ ప్రారంభించలేదు. పురపాలక ఎన్నికలను నిర్వహించింది. పరిషత్ ఎన్నికల్లో సభ్యుల బలవంతపు ఏకగ్రీవాలపై బాధితులనుంచి ఎన్నికల సంఘం ఇటీవల ఫిర్యాదులను ఆహ్వానించింది.
దీన్ని సవాల్ చేస్తూ... కొందరు వేసిన కేసు వేయగా ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. ఏకగ్రీవంగా ఎన్నికైన వారికి ధ్రువపత్రాలు జారీ చేయాలని తీర్పు చెప్పింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ నిలిచి ఏడాది పూర్తైందని.. ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి ఆగిపోకుండా వెంటనే ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్ఈసీ కోరారు. ఎన్నికల ప్రక్రియకు 6 రోజులు సరిపోతుందని ప్రభుత్వం చెబుతోంది.
ఎన్నికలను రద్దు చేయాలని జనసేన పార్టీ వేసిన పిటిషన్ హైకోర్టులో ఇంకా విచారణలో ఉంది. ప్రభుత్వం కోరుతున్నా.. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశం ఉత్కంఠ రేపుతోంది. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఉన్న కొద్దిపాటి సమయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనే విషయంపై సందేహం నెలకొంది. ప్రభుత్వం తాజాగా చేసిన విజ్ఞప్తి సహా తాజా పరిణామాల దృష్ట్యా ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
ఇదీ చదవండీ... చంద్రబాబుకు సీఐడీ నోటీసులు.. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆదేశం