Employees Unions on PRC: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ జూన్ 30 నాటికి ప్రొబేషనరీ ఖరారు చేస్తామని చెప్పి, ఇప్పుడు శాఖాపరమైన పరీక్ష ఉత్తీర్ణులు కావాలని ఎందుకు అంటున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రొబేషనరీ ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ న్యాయం జరగాల్సిందేనని స్పష్టం చేశారు.
పీఆర్సీ అమలుపై ఉద్యోగ సంఘాలతో సాధారణ పరిపాలన, ఆర్థికశాఖ అధికారులు బుధవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. పీఆర్సీ, డీఏ బకాయిలను పదవీ విరమణ సమయంలో ఇస్తామనడాన్ని నాయకులు వ్యతిరేకించారు. రెండు, మూడేళ్లలో పదవీ విరమణ పొందే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని,.. 15-20 ఏళ్ల సర్వీసు ఉన్నవారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని, చర్చల సమయంలోనూ దీన్ని చెప్పలేదని వెల్లడించారు. కారుణ్య నియామకాల్లోనూ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వాల్సి ఉండగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇస్తామనడం న్యాయం కాదని గట్టిగా ప్రశ్నించారు. జూన్ 30 నాటికి కారుణ్య నియామకాలు పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చినా అమలు కావడం లేదని పేర్కొన్నారు. ఆర్టీసీలో సుమారు 700 వరకు కారుణ్య నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.
సమావేశం అనంతరం ఆయా సంఘాల నేతలు విలేకరులతో మాట్లాడారు. వేతన సంఘం సిఫార్సుల మేరకే ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ఉంటాయని పేర్కొన్నారు. వారి పేస్కేల్స్‌పై ఉత్తర్వులు వెంటనే రాబోతున్నట్లు వెల్లడించారు. గురుకులాలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు తదితర ప్రభుత్వరంగ ఉద్యోగుల.. పదవీ విరమణ వయసు పెంపు 62 ఏళ్లకు పెంచుతూ ఒకేసారి ఉత్తర్వులు ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు.
సచివాలయ ఉద్యోగులందరికీ న్యాయం జరగాల్సిందే..
రాష్ట్రంలో 1,17,954 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు పని చేస్తుండగా, వీరిలో 56,756 మంది శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. వీరికి మాత్రమే ప్రొబెషనరీ ఖరారు చేసి, కొత్త వేతనాలు ఇస్తామని చెబుతున్నారు. దీనిని అంగీకరించే ప్రసక్తేలేదు. ఉద్యోగులకు బకాయిలను ఏప్రిల్ 30లోపు చెల్లిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినా.. ఇప్పటి వరకు ఇవ్వలేదు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని, అందిన వెంటనే తొలుత జీపీఎఫ్, ఆ తర్వాత సరెండర్ లీవులు, మెడికల్ బిల్లులు ఇస్తామని అధికారులు తెలిపారు. కారుణ్య నియామకాల కింద సచివాలయాల్లో ఉద్యోగాలు ఇస్తామనడంతో ఎవరూ ఆసక్తి కనబరచడంలేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. డీఏ, పీఆర్సీ బకాయిలను రెండు, మూడు దఫాలుగానైనా చెల్లించాలి. - బొప్పరాజు వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు ఏపీ జేఏసీ అమరావతి
ఒకటో తేదీనే పింఛను ఇవ్వాలి
విశ్రాంత ఉద్యోగులకు ఒకటో తేదీన కచ్చితంగా పింఛను అందేలా చూడాలని కోరాం. వైద్య, ఆరోగ్యశాఖ వ్యవహారాలకు సంబంధించి మరో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరగా అధికారుల నుంచి సానుకూలత వచ్చింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో మిగిలిన భాగస్వాములను సమావేశానికి పిలవాలని కోరాం. - బండి శ్రీనివాసరావు, అధ్యక్షుడు, ఏపీఎన్జీఓ
వన్ స్టెప్ ప్రకారం చెల్లించాలి
వేతన సవరణ సంఘం 102 ప్రభుత్వ శాఖల్లో 736 కేటగిరీల ఉద్యోగులకు వారి వేతన స్కేలులో వన్ స్టెప్ పెంచాలని సూచించింది. దీని ప్రకారం జీఓలు ఇవ్వాలని కమిటీని కోరాం. డీఏ బకాయిలను ఓపీఎస్ ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేశారు. సీపీఎస్ ఉద్యోగులు, పెన్షనర్లు బకాయిల చెల్లింపుపై నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగించాలి. - సూర్యనారాయణ, అధ్యక్షుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
జూన్‌లో సాధారణ బదిలీలు
పీఆర్సీ బకాయిలను మూడు, నాలుగు విడతల్లో ఇస్తామని ప్రభుత్వం ఇంతకుముందు చెప్పింది. ఇప్పుడు ఉద్యోగ విరమణ అనంతరం ఇస్తామని చెబుతోంది. పునఃపరిశీలించాలని కోరాం. శాఖాపరమైన పరీక్షల్లో సాధ్యమైనంత వరకు సచివాలయ సిబ్బంది ఉత్తీర్ణులయ్యేలా చూడాలని కోరాం. సీఎంను కలిసినపుడు సాధారణ బదిలీలు జూన్‌లో చేపట్టాలని కోరితే అంగీకరించారు. - వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు, సచివాలయ ఉద్యోగుల సంఘం
ఇదీ చదవండి: PRC: పదవీ విరమణ తర్వాతే పీఆర్సీ, డీఏ బకాయిలు..!