పీఆర్సీని ఈ నెలాఖరులోగా అమలు చేసేందుకు ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు సమయమిచ్చాయి. ప్రభుత్వం నుంచి స్పందన రాని పక్షంలో... 28న ఉమ్మడి సమావేశం తర్వాత తమ కార్యాచరణ ప్రకటిస్తామని సంఘాల నాయకులు తెలిపారు. ఎన్నికలకు ముందు ఉద్యోగుల కోసం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ఈ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. ఉద్యోగులంతా ఉద్యమానికి దిగే పరిస్థితి తీసుకురావొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నిన్నటి సమావేశంలో పీఆర్సీపై ఎలాంటి నిర్ణయమూ జరగలేదని.. పెండింగ్ బిల్లులు ఖచ్చితంగా ఎప్పుడు పూర్తిచేస్తారో కూడా ప్రభుత్వం చెప్పలేదని ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని సమస్యలపైనా రెండు ఐకాసలు సుదీర్ఘంగా చర్చించాయని పేర్కొన్నారు. రెండు ఐకాసలు కలిపి సుమారుగా 200 సంఘాలు ఉన్నాయన్న ఆయన.. పీఆర్సీపై ఆశలు పెట్టుకున్న ఉద్యోగులందరికీ.. నిరాశే మిగిలిందని అవేదన వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 27లోపు ఏపీ ఎన్జీవో సంఘం.. ఈనెల 28న ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతిలో సమావేశాలు నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
సీఎస్‌కు మెమోరాండం..
ఉమ్మడి సమావేశాల అనంతరం సీఎస్‌కు మెమోరాండం ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. "మా డబ్బులు మాకు ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేవా" అని బండి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాటలతో కాలయాపనే తప్ప, తమకు ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా మేనిఫెస్టో చూసి చాలా ఆశగా ఉన్నామని, ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లన్నీ పరిష్కారం అవుతాయని భావించామని అన్నారు. కానీ.. నిరాశే ఎదురైందని అన్నారు. ఉద్యోగుల ఓట్లు అక్కర్లేదా? అని వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఏ ఒక్క హామీ నెరవేరలేదు..
ఈ మూడేళ్లలో ఉద్యోగుల సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేరలేదని.. సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని పూర్తిగా మరిచిపోయారని మండిపడ్డారు. మంత్రుల కమిటీ, అధికారుల కమిటీ అంటూ సరిపెట్టి.. నివేదకలు మాత్రం ఇవ్వలేదని విమర్శించారు. ఒక్కరోజు ఆలస్యం లేకుండా పీఆర్సీ ఇస్తామని చెప్పి...కమిటీ నివేదికలోనూ ఆలస్యం చేస్తూ వచ్చారని ఆరోపించారు.
6 నెలల తర్వాత అధికారుల కమిటీ నియమించి అధ్యయనం చేస్తోందని చెబుతున్నారని బొప్పరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీలన్నీ కాలయాపనకే తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. హెల్త్ కార్డు అనారోగ్య కార్డుగా మారిందని ధ్వజమెత్తారు. కనీసం రీయింబర్స్‌మెంట్ కింద ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోపు పీఆర్సీ ప్రకటించకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు.
ఇదీ చూడండి: PADAYATRA: అమరావతి రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం.. కారణమేంటంటే..?