తెలంగాణలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌లో వినియోగించిన ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్)ల స్థితిగతులపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఆయా ఈవీఎంలను గుర్తించటంతోపాటు అవి ఏ స్థితిలో ఉన్నాయి? మరమ్మతులు అవసరమా? అదనంగా ఈవీఎంలు అవసరమైతే ఎక్కడి నుంచి తీసుకురావాలి? తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హుజూరాబాద్‌లో సుమారు 330 వరకు ఈవీఎంలను వినియోగించారు. ఆ ఎన్నికలపై న్యాయస్థానంలో ఎలాంటి వ్యాజ్యాలు లేకపోవటంతో వాటిని వినియోగించవచ్చు అని గుర్తించారు. కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అదుపులో ఉన్నాయని తెరాస ప్రభుత్వం స్పష్టం చేయటంతో త్వరలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు మార్గం సుగమం అయినట్లు అయింది. తెరాస నుంచి గెలుపొందిన ఈటల రాజేందర్ ఈ ఏడాది జూన్‌లో రాజీనామా చేయటంతో నిబంధనల మేరకు ఈ ఏడాది డిసెంబరులోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది.
నిజామాబాద్‌లో ఎం3 ఈవీఎంల వినియోగం
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. 2018 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి కేవలం పది మంది అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు. ఈ దఫా అభ్యర్థుల సంఖ్య పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు పోటీ చేస్తే ఆర్థిక సహాయం చేస్తామంటూ వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ప్రకటించింది. ఎంత మంది నిరుద్యోగులు ముందుకు వస్తారన్నది ఆసక్తికర అంశం. నోటాతో కలిపి 384 మంది లోపు అభ్యర్థులు పోటీ చేసినా ఎన్నికల సంఘం వద్ద అందుబాటులో ఉన్న అత్యాధునిక ఎం3 ఈవీఎంల ద్వారా పోలింగు నిర్వహించవచ్చు. అంతకు మించి ఎక్కువ మంది పోటీ చేస్తే అధికారులు పేపర్ బ్యాలెట్ పత్రం వైపు దృష్టి సారించాల్సి ఉంటుంది. 1996 లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో 477 మంది అభ్యర్థులు పోటీ చేయటంతో 50 పేజీల బ్యాలెట్ పత్రాన్ని రూపొందించి పోలింగు నిర్వహించారు. 2019లో నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో 185 మంది అభ్యర్థులు పోటీ చేయటంతో ఎం3 రకం ఈవీఎంలతో పోలింగు నిర్వహించారు. తొలిసారిగా ఆ అత్యాధునిక ఈవీఎంలను నిజామాబాద్‌లోనే వినియోగించటం విశేషం. ఈవీఎంలా? బ్యాలెట్ బాక్సులా? అన్నది నామినేషన్ల ఉపసంహరణ తరవాతే స్పష్టత వస్తుంది.
పెరిగిన ఓటర్లు 24 వేల మంది
ఉప ఎన్నిక జరగాల్సిన హుజూరాబాద్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటర్లు స్వల్పంగా పెరిగారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 2,09,224 మంది ఓటర్లు ఉన్నారు. తాజా గణాంకాల ప్రకారం ఆ సంఖ్య 2,33,374కు చేరింది. సుమారు రెండున్నరేళ్ల వ్యవధిలో 24,150 మంది ఓటర్లు పెరిగారు. నిబంధనల ప్రకారం నామినేషన్లు దాఖలు చేసేందుకు పది రోజుల ముందుకు వరకు దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తారు. అప్పట్లో పోలింగు కేంద్రాలు 297 ఉండగా తాజాగా ఆ సంఖ్య 305కు పెరిగింది.
ఇదీ చదవండి: ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలేవీ?... నిధుల కోసం పంచాయతీల ఎదురుచూపులు