తెలంగాణ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. జలాశయం ఇప్పటికే నిండు కుండలా ఉండటంతో బుధవారం రాత్రి వరకు రెండు క్రస్ట్ గేట్లతో నీటి విడుదల కొనసాగగా.. గురువారం ఉదయానికి రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో లక్షా 35వేల క్యూసెక్కులుగా ఉంది. దీంతో మొత్తం 8 గేట్లను ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు.
బుధవారం ఉదయం నుంచి సాగర్‌కు 1,95,215 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 18 క్రస్ట్ గేట్ల ద్వారా అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. నిన్న సాయంత్రం నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టండంతో కేవలం రెండు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి మళ్లీ స్వల్పంగా వరద ప్రవాహం పెరగడంతో 8 గేట్లను పాక్షికంగా ఎత్తివేశారు.
స్పిల్ వే ద్వారా..
4 గేట్లను 5అడుగుల మేర, మరొక 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి.. 92 వేల క్యూసెక్కుల నీటిని స్పిల్ వే ద్వారా విడుదల చేస్తున్నారు. జలాశయం నుంచి మొత్తం లక్షా 35 వేల క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లోగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం అంతే మొత్తం వద్ద కొనసాగుతోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.04 టీఎంసీలకు గాను 311 టీఎంసీలకు చేరింది. సాగర్ జలాశయం కుడి, ఎడమ, ఎమ్మార్పీ కాలువలకు సాగు నీరు విడుదల కొనసాగుతోంది.
ఇదీ చదవండి: 'మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం'.. హాకీ జట్టుకు అభినందనల వెల్లువ