పుస్తక పఠనం మన జీవితంలో అంతర్భాగం కావాలని ఈనాడు సంపాదకులు ఎం. నాగేశ్వరరావు ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు ఇలా అందరూ.. పిల్లలకు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం అలవాటు చేయాలని సూచించారు. పుస్తక పాఠనం వలన పురాణాలు, ఇతిహాసాలలోని మన సంస్కృతి గొప్పతనం తెలుస్తుందని వివరించారు. ప్రముఖ రచయిత్రి సుధామూర్తి రాసిన "రెండు కొమ్ముల రుషి" పురాణాల అసాధారణ కథలు పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సప్తపరిణీలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఈనాడు సంపాదకులు నాగేశ్వరరావు, మాజీ ఐపీఎస్ అధికారి, తెలంగాణ ముఖ్యమంత్రి సలహాదారుడు ఏకే ఖాన్, రచయిత్రి సుధామూర్తి, పలువురు పుస్తక ప్రియులు పాల్గొన్నారు.
"మహాత్మగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నెల్సన్‌మండేలా ఇలా ఎందరో మహానీయులు పుస్తకాలు చదవడం వలనే గొప్పవారు అయ్యారు. ఒక అతిసామాన్య మనిషిలోని అసమాన గుణాలను కథలుగా మార్చడంలో రచయిత్రి సుధామూర్తి దిట్ట. నిజజీవితంలోని ఘటనలే కథాంశాలుగా ఆమె ఎక్కువగా రచనలు చేశారు. నేటి తరానికి మన పురాణాల్లోని గొప్పతనం తెలియకపోవడం వలనే మహిళలపై, పిల్లలపై అత్యాచారాలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు ఇలా అందరూ.. పిల్లలకు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం అలవాటు చేయాలి." -ఎం. నాగేశ్వరరావు, ఈనాడు సంపాదకులు
తెలుగు సాహిత్యానికి, సంస్కృతికి మంచి భవిష్యత్ ఉందని మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ అన్నారు. గతంలో గణితం, సామాన్య శాస్త్రంతో పాటు తెలుగు భాషకు మంచి ప్రాధాన్యత ఉండేదన్నారు. మనకు గుర్తింపు ఇచ్చేది మాతృభాషే అని.. దాన్ని నిర్లక్ష్యం చేయవద్దని రచయిత్రి సుధామూర్తి అన్నారు. పురాణాలు, ఇతిహాసాలు మన దేశంలో అంతర్‌భాగం అని పేర్కొన్నారు.
"నేను మహారాష్ట్రలో కొంత, కర్ణాటకలో కొంత పెరిగాను. నాకు రెండు భాషలు సమానంగా బాగా తెలుసు. ఇది సాధ్యం అవుతుంది. మా అమ్మ చెబుతా ఉండే వారు.. భాష అనేది వాహనం అని. నువ్వు డ్రైవర్‌వి అని. వాహనం మారుతూ నడుపుతూ ఉండాలి. ఇది మనసులో బాగా గుర్తు పెట్టుకోవాలి. మన పిల్లలకు ఇంగ్లీష్ మాత్రమే తెలుసు.. తెలుగు తెలియదంటే అది తప్పు. పిల్లలు రెండు భాషలను సమానంగా తెలుసుకుని ఉండాలి. తెలుగుకి మాతృభూమితో సంబంధం ఉంటుంది. తెలుగు మన సంస్కృతితో ముడిపడి ఉంటుంది. తెలుగు మన తల్లి." -సుధామూర్తి, పుస్తక రచయిత్రి
ఇవీ చూడండి: