పాఠశాలలు విద్యార్థుల ప్రవేశాలు నిర్వహించుకోవచ్చని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. సెప్టెంబరు 4 వరకు ప్రత్యామ్నాయ క్యాలెండరును విడుదల చేసింది. ప్రైవేటు, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలలు ఈ క్యాలెండరును పాటించాలని శనివారం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. సెప్టెంబరు 5న పాఠశాలలు పునః ప్రారంభంకానున్న దృష్ట్యా అప్పటివరకు ఈ ప్రత్యామ్నాయ క్యాలెండరు అనుసరించాలని ఆదేశించింది. ఈ వ్యవధిలో విద్యార్థుల సామర్థ్యాలు, ప్రవేశాలు, ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ జిల్లా అధికారులకు సూచించింది. క్యాలెండరులోని వివరాలిలా..
ప్రవేశాలు నిర్వహించుకోవచ్చు
- కరోనా నిబంధనలు ఉల్లంఘించకుండా పాఠశాలలు 2020-21 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు చేపట్టవచ్చు.
- ఉత్తీర్ణులైన విద్యార్థులు ఏ పాఠశాలల్లో చేరాలనుకుంటున్నారో తల్లిదండ్రుల ద్వారా తెలుసుకొని వాటి ప్రకారం ప్రవేశాలు చేపట్టాలి.
- వలస వెళ్లి తిరిగొచ్చిన కుటుంబాల పిల్లల విషయంలో గుర్తింపు కోసం తప్ప ఇతర ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదు.
- 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదు. విద్యార్థి అభ్యసన సామర్థ్యాలు సాధించారా? లేదా? అన్నది పరిశీలించాలి.
- 9, 10 తరగతుల విద్యార్థులకు అంతర్గత మదింపు చేపట్టవచ్చు. ఇవి కూడా ప్రత్యామ్నాయ క్యాలెండరుకు సంబంధించినవై ఉండాలి. విద్యాసంవత్సరం మొదలుకాలేదు కాబట్టి సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహించకూడదు.
క్యాలెండర్‌కు అనుగుణంగానే బోధన
- ప్రత్యామ్నాయ క్యాలెండర్‌కు అనుగుణంగా పాఠ్యాంశాల్ని ఆన్‌లైన్ ద్వారా బోధించవచ్చు. పూర్వ ప్రాథమిక విద్యార్థులకు రోజుకు 30 నిమిషాలు, 1 నుంచి 8 తరగతులకు 30 నుంచి 45 నిమిషాల తరగతుల్ని రెండు విడతల్లో మాత్రమే చేపట్టాలి.
- 9, 10 తరగతులకు 30- 45 నిమిషాల తరగతులు రోజుకు 4 కన్నా ఎక్కువ నిర్వహించకూడదు.
మూడు విధాలుగా విద్యార్థులు
- ఉపాధ్యాయులు తరగతిలోని విద్యార్థులను ఆన్‌లైన్ అందుబాటులో ఉన్నవారు(హైటెక్). రేడియో, టీవీ ఉన్నవారు(లోటెక్). కంప్యూటర్, మొబైల్, రేడియో, టీవీ లేనివారు(నో టెక్)గా విభజించుకోవాలి.
- 1-5 తరగతుల విద్యార్థులు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించేలా తల్లిదండ్రులకు అభ్యసన పత్రాలు అందించాలి.
- 6-8 తరగతుల విద్యార్థులతో ప్రాజెక్టు పనులు చేయించాలి.
- 9, 10 తరగతుల విద్యార్థులకు విషయాల వారీగా ఆన్‌లైన్, రేడియో ద్వారా బోధించవచ్చు. ఇందుకోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చే విద్యావంతుల సేవలను వినియోగించుకోవచ్చ
- ఉపాధ్యాయులు వేర్వేరు రోజుల్లో వారానికి ఒకసారి పాఠశాలకు రావాలి. బయోమెట్రిక్ హాజరు వేయాల్సిన అవసరం లేదు.
- దీర్ఘకాలిక సమస్యలు, కంటెయిన్‌మెంట్ జోన్లలో ఉన్నవారు హాజరుకావాల్సిన అవసరం లేదు.
- ఉపాధ్యాయులు ప్రతి రోజు కనీసం 15 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి పురోగతి తెలుసుకోవాలి.
ఇదీ చదవండి: