Casino:విదేశీ క్యాసినో దందాలో హవాలా లావాదేవీల గుట్టు తేలే సమయం ఆసన్నమైందా? పొరుగు దేశాల్లో క్యాసినోల నిర్వహణలో అనుభవం గడించిన చీకోటి ప్రవీణ్ బృందం చీకటి బాగోతం బహిర్గతం కానుందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రవీణ్ బృందాన్ని సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారించనుండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. నేపాల్, శ్రీలంక, ఇండోనేసియా, థాయ్‌లాండ్.. తదితర దేశాల్లో క్యాసినో క్యాంపులకు వందల మంది పంటర్లను తరలించినట్లు ఈడీ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించింది.
ఒక్కో విడత మూడు నాలుగు రోజులపాటు జరిగే క్యాంపుల్లో పాల్గొనేందుకు పంటర్లు రూ.3-5లక్షల చొప్పున ప్రవీణ్ బృందానికి చెల్లించినట్లు గుర్తించింది. క్యాంపుల్లో జూదం ఆడేందుకు పంటర్లకు కావాల్సిన క్యాసినో టోకెన్లను సమకూర్చడం దగ్గరి నుంచి పంటర్లు గెలుచుకున్న సొమ్మును నగదు రూపంలో అప్పగించడం వరకు అంతా హవాలా మార్గంలోనే నడిచిందనేది ప్రధాన అభియోగం. అలాగే కమీషన్ల రూపంలో ప్రవీణ్ సంపాదించిన సొమ్మునూ ఈ మార్గంలోనే రప్పించుకుని ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇప్పటికే ప్రవీణ్‌తో పాటు అతడి అనుచరుడు దాసరి మాధవరెడ్డి బ్యాంకు లావాదేవీల గురించి ఈడీ ఆరా తీసింది.
దీనికితోడు వారి పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలనూ క్షుణ్నంగా పరిశీలిస్తోంది. మరోవైపు చీకోటి తన జన్మదిన వేడుకలు.. బోనాలు, వినాయకచవితి పండుగల సందర్భంగా పెద్దఎత్తున చేసిన వ్యయాలనూ లెక్కగడుతోంది. వీటన్నింటినీ క్రోడీకరించుకొన్న సమాచారం ఆధారంగా ప్రవీణ్‌ను సోమవారం విచారించనుంది. ప్రవీణ్, మాధవరెడ్డితో పాటు నగరంలోని మరికొందరు హవాలా ఏజెంట్ల ద్వారా వచ్చే సమాచారం ఆధారంగా దర్యాప్తులో ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో హవాలా లావాదేవీల్లో రాజకీయ, సినీ ప్రముఖుల పాత్ర బహిర్గతమవుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.