Economic and social destruction in state: రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ విధ్వంసం జరిగిందని.. ప్రజా చైతన్యంతోనే మార్పు సాధ్యమని ప్రజాసంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవన్‌లో శుక్రవారం ఏపీ ప్రొఫెషనల్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కులవృత్తులు, బలహీన- మైనారిటీవర్గాల సాధికారత, రాజకీయాలు, పోలీసు వ్యవస్థ తీరుతెన్నులపై చర్చించారు.
కళాశాలల్లో ఎన్నికలు నిర్వహించి యువత రాజకీయాల వైపు వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. సరైన ప్రణాళిక లేక రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. నిధుల లేమితో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోవడంతో పాటు మున్సిపల్ కార్మికులకు జీతాలివ్వలేని పరిస్థితులు తలెత్తాయన్నారు. ఇక్కడ చర్చించిన ప్రతి అంశంపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చ, మేధో మథనం జరగాలని అభిప్రాయపడ్డారు. అన్ని అంశాలపై ముసాయిదా తయారు చేస్తామని, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కలిసికట్టుగా కేంద్రాన్ని నిలదీసి, విభజన హామీలను నెరవేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వినయకుమార్, జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణాంజనేయులు, నవ్యాంధ్ర రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు టి.అరుణ, హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య, ఉపాధ్యాయ సంఘం నాయకుడు కొల్లూరి శ్రీనివాసరావు, జైభీమ్ పార్టీ ఒంగోలు అధ్యక్షుడు వెంకటరావు, రైతుసంఘం నేత చుంచు శేషయ్య, ప్రకాశం జిల్లా పౌరసంఘం అధ్యక్షుడు జి.నరసింహారావు, ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాలల ఛైర్మన్ అంజుమన్, శ్రీకాంత్ చౌదరి, కామేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: