Power Cut Problem in Industries: రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ సమస్యపైనే చర్చలు సాగుతున్నాయి. ఇంట్లో చిన్నారుల నుంచి పరిశ్రమ వర్గాల వరకు.. వారివారి స్థాయిల్లో విద్యుత్ కోతలపైనే మాట్లాడుకుంటున్నారు. వేసవి కావడంతో.. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. అందుకు తగ్గ ముందస్తు ఏర్పాట్లు, తగిన చర్యలు లేకపోవడంతో విద్యుత్ కోతలు అనివార్యమయ్యాయి.
ఈ విషయంలో అన్ని వర్గాలకు ఇబ్బందిగా ఉంటుండగా పరిశ్రమ వర్గాల్లో మాత్రం మరింత ఆందోళనలున్నా యి. ఇప్పటికే.. రెండేళ్ల పాటు.. కొవిడ్ కష్టాలకు ఎదురొడ్డామంటున్న.. వ్యాపారులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో కరెంట్ కోతల రూపంలో మరోసారి దివాళా తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ వాపోతున్నారు.
వాస్తవానికి ఎంస్ఎంఈల్లోనే ఎక్కువ శ్రామిక శక్తి పని చేస్తుంటుంది. అందుకే ఈ రంగానికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటాయి. నిరక్షరాస్యులు, కొద్దిపాటి చదువులున్న వారి నుంచి ఉన్నత విద్యావంతుల వరకు లక్షల మందికి ఉపాధిమార్గంగా ఉంటోంది. అలాంటిది.. రంగం ఇప్పుడు నష్టాలబాటలో నడుస్తోందంటున్నారు.. వ్యాపారులు. పవర్ హాలిడేలు తమ పాలిట శాపమవుతుందంటున్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి తగ్గడం, వినియోగం పెరగడంతో ఏప్రిల్ 8 నుంచి పవర్ హాలిడే అమలు చేస్తున్నట్లు ఇంధనశాఖ ప్రకటించింది. వారంలో ఒకరోజుపవర్ హాలిడే కాగా ఆదివారం సెలవుతో కలుపుకుని మొత్తంగా వారంలో 2రోజులు కరెంట్ కోతలు అమల్లోకి వస్తాయంటూ ఆదేశాలు జారీ చేసింది.
వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ను 7 గంటలకు కుదించారు. పరిశ్రమలు వినియోగించే విద్యుత్ వాడకాన్ని రోజూ సాయంత్రం 6 గంటల ఉదయం వరకు నియంత్రించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఈ నిర్ణయమే పరిశ్రమలకు ఇబ్బంది కలిగిస్తోంది. ఎండల కారణంగా.. మధ్యాహ్నం వేళ పనులకు విరామమిస్తూ సాయంత్రం, రాత్రివేళల్లోనే పనులు సాగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. దాంతో ఉత్పత్తి భారీగా తగ్గిపోతుంది. ఒకవేళ ఎవరైనా 6 దాటిన తర్వాత విద్యుత్ వినియోగిస్తే ఒక యూనిట్‌కు అసలు ధర కంటే 6 రేట్లు అధికంగా అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు. పైగా.. పవర్ హాలిడే రోజూ కనీస ఛార్జీల పేరుతో అధిక భారాన్ని మోపుతున్నారని వ్యాపారులు అంటున్నారు..
విరామం లేకుండా పనిచేసే ప్రాసెసింగ్ పరిశ్రమలు.. విద్యుత్ వినియోగాన్ని సగానికి తగ్గించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు ఆదేశాలు జారీ చేశాయి. దాంతో.. పరిశ్రమల్లో ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. కొన్నిచోట్ల 40-50 ఉత్పత్తి పడిపోగా, మరికొన్నింటిలో 80% మేర తగ్గి పోయాయి. దాంతో ముందస్తు చేసుకున్న ఒప్పందాల మేరకు సరఫరాలు అందించలేక పోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. దాంతో.. పొరుగు రాష్ట్రాల పరిశ్రమలతో పోటీపడలేక పోతున్నాం అంటున్నారు. విశాఖ ఆటోనగర్ లో 1800 పరిశ్రమలుంటే ఇప్పుడు 800 సంస్థలే పనిచేస్తున్నాయి. మిగతావి మూతపడ్డాయి. ఇక విజయవాడ లోని ఆటోనగర్ 2-3 వేలమంది, జేఆర్డీ టాటా ఇండస్ర్టీలో 3 వేల మంది కార్మికులు పనిచేస్తారు. కొత్త ఆటోనగర్ లో 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఇక్కడి పరిశ్రమల్లో ఎక్కువగా ప్రాసెసింగ్ యూనిట్లే ఉండడంతో పవర్ హాలిడే ప్రభావం తీవ్రంగా పడుతోంది.
విద్యుత్ కోతలతో పాటు పెంచిన సెస్‌లు మరింత ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. 4 పైసలుగా ఉన్న సెస్ ఏకంగా రూపాయిగా చేశారు. హెచ్.టి విద్యుత్ వాడే వారికి సమయం బట్టి విద్యుత్ రేట్లు నిర్ణయించడంతో వ్యయం తడిసిమోపెడవుతోందని వాపోతున్నాయి.. పరిశ్రమ వర్గాలు. ఈ భారాల్ని తప్పించుకునేందుకు డీజిల్ జనరేటర్లు వినియోగిద్దాం అంటే చమురు ధరలు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి.పైగా యూనిట్‌కు 30 రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఇంత భారం తమవల్ల కాదంటున్నాయి ఎంస్ఎంఈ వర్గాలు.
ఒక పరిశ్రమ నడిస్తే దానిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలు, వేల మంది పని చేస్తుంటారు. వాళ్ల కుటుంబాలు బతుకుతుంటాయి. ఈ కారణంగానైనా కష్టాల్లో ఉన్న పరిశ్రమ ల్ని కాపాడేందుకు ప్రభుత్వాలు అదనపు సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. కానీ కనీసం విద్యుత్ కూడా సరిపడా ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పవర్ హాలిడే పేరుతో గంటల కొద్దీ విద్యుత్‌ను నిలిపివేయడం, అపరాధ రుసుంల పేరుతో వేధించడం సరైంది కాదంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ కాలం పరిశ్రమల్ని నడపడం వీలు కాదంటున్న వ్యాపారులు ఇప్పటికే 30-40% చిన్న పరిశ్రమలు మూసేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న చోట్ల కూడా పెద్ద సంఖ్యలో కార్మికుల్ని విధుల నుంచి తొలగించేస్తున్నారు అంటున్నారు. లాభాల సంగతేమో కానీ రోజువారీ పనులు చేసుకోలేని పరిస్థితుల్లో కార్మికుల్ని ఎలా కొనసాగించగం అంటున్నారు.
విద్యుత్ కోతలు, ఛార్జీలు.. పరిశ్రమల పైనే కాదు ప్రజలపైనా అదనపు భారాన్ని మోతుపు తున్నాయి. రాష్ట్రంలోని కోటి 70 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా వారందరి పై భారం పడింది. గత 20 ఏళ్ల కాలంలో ఏ ప్రభుత్వమూ 50 యూనిట్లలోపు వాడుకునే పేదల జోలికి రాలేదు. కానీ.. ఇప్పుడు వారికీ కరెంట్ ఛార్జీల భారం తప్పలేదు. 30 యూనిట్ల లోపు వాడుకునే వారిపై 30%, 75 యూనిట్లు వాడేవారిపై 44%, 125 యూనిట్ల లోపు వాడుకునే వారిపై 45% వరకు అదనపు భారం వేసింది. దాంతో 14వందల కోట్లు అదనంగా వసూలయ్యాయి. అవి కాక ట్రూ అప్ వసూళ్ల పేరుతో 2014-19 మధ్య వినియోగించిన విద్యుత్‌పై 2 వేల900 కోట్లు వసూలు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఇదీ చదవండి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధంకండి: సీపీఐ నేత రామకృష్ణ