Corona Effect on Pregnant Women : తెలంగాణలో కరోనా ఉద్ధృతి పెరుగుతుండడంతో గర్భిణులు త్వరితగతిన వైరస్ బారిన పడుతున్నారు. నెల వారీ టెస్టుల కోసం వెళ్తున్న క్రమంలో మహమ్మారి సోకుతోంది. ఇటీవల కాన్పుల కోసం వచ్చిన గర్భిణీలు.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థానిక ఆస్పత్రుల్లో చేరిన పది మందికి కరోనా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడి వైద్యులు వారిని గాంధీకి పంపించారు. ఇక్కడే పురుడుపోసి ప్రత్యేక వార్డుల్లో ఉంచారు. శిశువుల నమూనాలు సేకరించారు. ప్రస్తుతం తల్లుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవని వివరించారు. నిత్యం జిల్లాల నుంచి ఇద్దరు, ముగ్గురు గర్భిణులు కరోనాతో గాంధీకి వస్తున్నారు.
24 గంటల్లో 2,089 కేసులు!
Corona Effect on Pregnant Ladies : మూడో వేవ్ కరోనా దడ పుట్టిస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోనూ బాధితుల శాతం పెరుగుతోంది. ఈ మూడు జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో 2,089 మంది వైరస్ బారిన పడ్డారు. జీహెచ్‌ఎంసీలో అధికంగా 1,583 మందికి కొవిడ్ సోకింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 292 కేసులు నమోదవగా రంగారెడ్డిలో 214 మందికి నిర్ధారణ అయ్యింది. ఒమిక్రాన్ ప్రభావంతో గత వారం రోజులుగా బాధితుల సంఖ్య పెరుగుతోంది.
ఇలా చేయండి..
Covid Effect on Pregnant Women : మూడో దశలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. రెండో దశ మాదిరిగానే గర్భిణులపై ప్రభావం కనిపిస్తోంది. అయితే అప్పటి మాదిరిగా అంత తీవ్ర సమస్యలు లేకపోవడం పెద్ద ఊరట అని గాంధీ ఆస్పత్రి గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ మహాలక్ష్మి తెలిపారు. అయినా అజాగ్రత్తగా ఉండకూడదన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని ఆమె సూచిస్తున్నారు.
* మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో గర్భిణుల్లో కన్పించే ఏ లక్షణాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యులకు చెప్పాలి.
* నిత్యం గుడ్డు, పాలు, ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు, చికెన్, చేపలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మంచి ఆహారం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధులను అడ్డుకుంటుంది.
* కొవిడ్ కారణంగా టెస్టుల పేరుతో ఎక్కువసార్లు ఆసుపత్రికి వెళ్లినా ఇబ్బందే. ముందే వైద్యులతో మాట్లాడి విజిట్‌లను కుదించుకోవాలి.
* ఇతర వ్యక్తులకు దూరంగా ఉండటం, మాస్క్ ధరించడం తప్పనిసరి. పండగలకు ఊళ్లు వెళ్లడం, పెళ్లిళ్లు, సీమంతాలు, బంధువుల ఇళ్లకు వెళ్లడం లాంటివి తగ్గించుకోవాలి. ఇంట్లో కూడా ప్రత్యేక గదిలో ఉండటం శ్రేయస్కరం.
ఇది అదే కావచ్ఛు.. నిర్లక్ష్యం వద్దు
రెండో విడత కరోనా విజృంభణలో చాలా మందిలో పలు రకాల సమస్యలు కనిపించాయి. తీవ్ర జ్వరం, తలనొప్పి, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం లాంటి అవస్థలతో ఆసుపత్రుల్లో చేరారు. చివరికి పడకలు లభించక తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ప్రస్తుతం మూడో దశ కరోనాలో ప్రస్తుతం ఈ తరహా ఇబ్బందులు కనిపించడం లేదు. చాలా మందిలో అప్పర్ రెస్పిరేటరీ(ముక్కు, నోరు, గొంతు సంబంధిత) సమస్యలు మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు చలి వాతావరణం ఉంటోంది. దీంతో చాలామంది ఈ లక్షణాలు సాధారణమే అని భావిస్తున్నారు. టెస్టులు చేయించుకోవడం లేదు. బయట తిరుగుతుండటంతో వారి నుంచి మరి కొందరికి కరోనా వ్యాప్తి చెందుతోంది.
వ్యాప్తి ఎక్కువైతే ముప్పే..
ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య తక్కువే ఉన్నా వ్యాప్తి ఎక్కువైతే ఆస్పత్రిలో పడకలు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే వ్యాప్తిని అరికట్టాలి. లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేసుకోవాలి. కరోనా నిర్ధారణ అయితే వారం, పది రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండాలి. ఫలితంగా మరొకరికి వైరస్ సోకకుండా చూసుకోవచ్ఛు. -డాక్టర్ రమణప్రసాద్, సీనియర్ పల్మనాలజిస్టు
ఇదీ చదవండి: వైద్య కళాశాలలో లైంగిక ఘటన.. ప్రాంక్ వీడియో చేశానంటున్న డాక్టర్