రాష్ట్రంలో రాజకీయ దురుద్దేశంతోనే ఆలయాలపై దాడులు చేస్తున్నారని, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే వారి పట్ల కఠినంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. విగ్రహ ధ్వంసం ఘటనలపై లోతుగా దర్యాప్తు చేసి ఎవరు చేస్తున్నారో బయటపెట్టాలని ఆదేశించారు. వాటి వెనుక ఎవరున్నా లెక్క చేయొద్దని, ఎవరినీ వదిలిపెట్టొద్దని స్పష్టం చేశారు. మళ్లీ అలాంటి నేరం చేయాలంటే భయపడేలా వ్యవహరించాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన మంగళవారం స్పందన కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.
రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్‌ఫేర్ నడుస్తోంది. రాజకీయ దురుద్దేశంతోనే ఆలయాల్లో విధ్వంసాలు జరుగుతున్నాయి. దేవుడంటే భయం, భక్తి లేకుండా విగ్రహాలను ధ్వంసం చేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని చూస్తున్నారు. ఎవరూ లేని ప్రదేశాల్లో, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో అందరూ నిద్రపోయాక గుడులపై దాడులు చేస్తూ విగ్రహాలను పగులగొడుతున్నారు. ఆ మరుసటి రోజు సామాజిక మాధ్యమాలు, పత్రికలు, ఛానెల్స్‌లో ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్ష పార్టీల నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. ఇలాంటి నేరాలనూ పోలీసులు పరిగణనలోకి తీసుకోవాల్సిన దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. ప్రభుత్వం ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందిస్తుంటే జీర్ణించుకోలేక దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయ గెరిల్లా వార్‌ఫేర్‌ను ఎదుర్కొంటూనే మత సామరస్యంపై మాట్లాడే మాటలకు ప్రచారం కల్పించాలి. రాజకీయ లబ్ధికోసం ప్రయత్నించే వారికి గుణపాఠం చెప్పాలి- జగన్, ముఖ్యమంత్రి
ఇదీ చదవండి