Modi Hyderabad Tour: ప్రధాని మోదీ పర్యటనను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పోలీసులు డిజిటల్ కూంబింగ్ మొదలుపెట్టారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న రకరకాల చర్చలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అనుమానిత సంభాషణలు, అవాంఛిత వ్యక్తుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాని పర్యటన విజయవంతంగా పూర్తయ్యేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
Digital Combing in Hyderabad : భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీతోపాటు దాదాపు 40 మంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు నగరంలో రెండు రోజులపాటు మకాం వేయనున్న సంగతి తెలిసిందే. అసాంఘికశక్తులు, నిరసనకారులు దీన్ని అవకాశంగా తీసుకునే ప్రయత్నాలు జరుగుతాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొదలైన నిరసనలు విధ్వంసానికి దారి తీయడం, దీనికి ప్రధాన ప్రతిపక్షాలు మద్దతు తెలపడంతో ప్రధాని పర్యటన సందర్భంగా అకస్మాత్తుగా ఎక్కడైనా ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రధానితోపాటు కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి కూడా వస్తుండటంతో వారి దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు కూడా జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అటువంటివి జరిగితే పోలీసుల వైఫల్యంగానే పరిగణిస్తారు. ఈ క్రమంలో అలాంటివి జరగకుండా ముందుగానే పసిగట్టే ఉద్దేశంతో పోలీసులు డిజిటల్ మాధ్యమాలను జల్లెడ పడుతున్నారు. వాట్సప్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాలతోపాటు ఇతరత్రా చాటింగ్ యాప్‌లనూ గమనిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను పరిశీలించేందుకు రాష్ట్రవ్యాప్తంగా గల ప్రత్యేక ల్యాబులను పూర్తిస్థాయిలో వాడుకుంటున్నారు.ఇప్పటికే బహుళ అంచెల భద్రతా ప్రణాళికను రూపొందించిన పోలీసులు తాజాగా యాంటీ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నారు.
ఇవీ చదవండి :