Difficulties in supply of water at towns in AP: పట్టణాల్లో వేసవిలో తాగునీటి సరఫరాను నిధుల కొరత వెంటాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 65 పట్టణ స్థానిక సంస్థలు రోజూ 533 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నాయి. వీటిలో ఆయా సంస్థలకు చెందిన సొంత ట్యాంకర్లు 199 కాగా.. అద్దెకు తీసుకుని నడుపుతున్నవి 334. మొత్తంమీద రోజూ 3,778 ట్రిప్పులతో 30 లక్షల లీటర్ల నీటిని ప్రజలకు నిత్యం అందిస్తున్నారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నిధులు రెండేళ్లుగా విడుదల చేయని కారణంగా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్న గుత్తేదారులకు చాలాచోట్ల బిల్లులు చెల్లించడం లేదు. సాధారణ నిధులు ఉన్న చోట్ల తాత్కాలికంగా సర్దుబాటు చేస్తున్నారు. అలాంటి అవకాశం లేని మూడో శ్రేణి పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పెండింగ్ బిల్లులు పెరిగిపోతున్నాయి. ఇంజినీర్లు గుత్తేదారులను బతిమాలుకుని ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయిస్తున్నారు.
తాగునీటి సమస్య ఉన్న 65 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఈ వేసవిలో ట్యాంకర్లతో ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. గుంతకల్, అమలాపురం, పెద్దాపురం, మాచర్ల, కావలి, కనిగిరి, మార్కాపురం, పొదిలి పట్టణాల్లో రోజూ ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు. రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, ఒంగోలు నగరపాలక సంస్థల్లోని శివారు ప్రాంతాలకు నీటి సరఫరాకు పెద్ద సంఖ్యలో ట్యాంకర్లను వినియోగిస్తున్నారు.
వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు పురపాలక సంస్థలు, నగర పంచాయతీల అధికారులు ఏటా రూ. 25 నుంచి రూ. 35 కోట్ల అంచనాలతో ప్రణాళికలు తయారు చేస్తుంటారు. ఈ మేరకు ప్రతికూల వాతావరణ పరిస్థితుల నిధులను ప్రభుత్వం కేటాయిస్తుంది. గత రెండేళ్లుగా ప్రభుత్వం నిధులు విడుదల చేయని కారణంగా ప్రత్యేకించి సాధారణ నిధులు తగినన్ని లేని పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు అల్లాడుతున్నాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే రూ. 25 కోట్ల వరకు బిల్లులు పెండింగులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ. 150 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని గుత్తేదారులు చెబుతున్నారు.
అయితే.. పెండింగు బిల్లుల విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ప్రభుత్వ తీరుతో తాము అప్పుల పాలయ్యామని ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్న వారు చెబుతున్నారు. కొన్నిసార్లు ట్యాంకర్లకు డీజిల్ కొనేందుకూ తిప్పలు పడుతున్నట్లు వివరిస్తున్నారు. చాలాసార్లు నీటి సరఫరా నిలిపేయాలని అనుకున్నా.. ప్రజా ప్రతినిధులు, అధికారుల ఒత్తిడితో వడ్డీలకు అప్పులు తెచ్చి నడుపుతున్నట్లు వాపోతున్నారు.