తెలంగాణలో 8 నెలల తరువాత పాఠశాలలు ప్రారంభమయ్యాయని డీహెచ్(DH) శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాలున్నాయని.. తొలిరోజు తక్కువమంది విద్యార్థులు వచ్చారని చెప్పారు. కొవిడ్, సీజనల్ వ్యాధుల లక్షణాలుంటే బడికి పంపొద్దని పిల్లల తల్లిదండ్రులకు డీహెచ్ సూచించారు. 95 శాతం మంది పాఠశాలల సిబ్బందికి వాక్సినేషన్ పూర్తయిందన్నారు. టీకా తీసుకున్న సిబ్బందికే పాఠశాలల్లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. పాఠశాలలో మాస్క్, తరచూ శానిటైజర్ వాడాలని కోరారు.
శాస్త్రీయ ఆధారాలు లేవు
మూడో వేవ్ గురించి శాస్త్రీయ ఆధారాలు లేవని.. కొత్తరకం స్ట్రెయిన్ వస్తే తప్ప మూడో వేవ్ అవకాశం లేదని డీహెచ్ చెప్పారు. ప్రభుత్వం మూడోవేవ్‌కు సన్నద్ధంగా ఉందన్నారు. కొవిడ్ వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదని తెలిపారు. పిల్లల్లో విద్యపై ఆసక్తి తగ్గుతోందని పేర్కొన్నారు. పిల్లలు ఫోన్లకు బానిసలు అవుతున్నారని తెలిపారు. పిల్లల మానసిక స్థితి దృష్టిలో ఉంచుకునే పాఠశాలలు తెరిచామన్నారు. తల్లిదండ్రులు ధైర్యంగా పిల్లలను స్కూల్‌కు పంపాలని కోరారు.
100 శాతం కోలుకుంటున్నారు
1 నుంచి 10 ఏళ్లలోపు వారిలో కేవలం 3 శాతం మంది కొవిడ్ బారిన పడ్డారని.. 20 ఏళ్లల్లోపు వారిలో 13 శాతం మందికి కొవిడ్ సోకిందని వెల్లడించారు. పిల్లలకు కొవిడ్ సోకినా 100 శాతం కోలుకుంటున్నారని డీహెచ్ శ్రీనివాసరావు చెప్పారు. సీరో సర్వే ప్రకారం పెద్దల్లో 63 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు వెల్లడయిందని తెలిపారు. బోనాలు వంటి వేడుకలు జరిగినా కేసులు పెరగలేదని గుర్తు చేశారు.
పెద్దవారిలో కరోనా ఎక్కువగా వస్తోంది. పిల్లలకు తక్కువగా సోకుతోంది. పిల్లలకు కొవిడ్ వచ్చినా వారిలో తీవ్రత కనిపించడం లేదు. పిల్లలు ఎవరు చనిపోలేదు. మన రాష్ట్రంలోనే కాకుండా దేశం, ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. పిల్లల రికవరీ రేటు అధికంగా ఉంది. ఐసీఎంఆర్, కొన్ని ఇతర సంస్థలు అక్టోబర్లో థర్డ్ వేవ్ వస్తుందని చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కొవిడ్ పూర్తిగా అదుపులో ఉంది. -శ్రీనివాస రావు, డీహెచ్
ఇదీ చదవండి: