తెలంగాణలో మావోల ఏరివేతకు ప్రత్యేక వ్యూహ రచన కోసం ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్‌స్టేషన్‌లో పోలీసు ఉన్నతాధికారుల అంతర్గత సమావేశం నిర్వహించారు. మావోల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయడం సహా.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అధికారుల మధ్య సమన్వయం వంటి అంశాలను సమగ్రంగా చర్చించారు.
తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సహా కేంద్ర హోంమంత్రిత్వశాఖ సీనియర్ సలహాదారు కె.విజయ్‌కుమార్, సీఆర్పీఎఫ్ డీజీ ఏపీ మహేశ్వరి, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర యాంటీ నక్సల్స్ ఆపరేషన్ డీజీ అశోక్ జునేజా, సీఆర్పీఎఫ్ డీఐజీ (ఆపరేషన్స్) ప్రకాశ్, బస్తర్ రేంజ్ డీఐజీ సుందర్రాజ్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా ఎస్పీలు సునీల్ దత్, సంగ్రామ్ సింగ్ పాటిల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో మావోయిస్టులు తమ కార్యకలాపాలను విస్తరించినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. మందుపాతరల ఏర్పాటు ప్రయత్నం వంటి ఘటనలతో ఏజెన్సీ ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు యత్నించడం వల్ల వాటిని నియంత్రించి తిరిగి ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి పోలీసు ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు.
మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతానికి మావోయిస్టులు ప్రవేశించారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు అటవీ ప్రాంతాల్లో అడుగడుగునా ప్రత్యేక బలగాలు జల్లెడ పడుతున్నాయి.