గనుల శాఖపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గనుల శాఖలో సంస్కరణలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ-ఆక్షన్ ద్వారా మైనర్ మినరల్స్ విక్రయించాలని నిర్ణయించారు. సీనరేజ్ ఫీజు వసూలును పొరుగుసేవలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.
గ్రానైట్ మైనింగ్‌లో బరువు ఆధారంగా సీనరేజ్ నిర్ణయించాలని జగన్ ఆదేశించారు. దీనివల్ల కనీసం 35 నుంచి 40 శాతం ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. లీజు పొంది, గనులు నిర్వహించని చోట్ల కొత్తగా ఈ-వేలం వేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ-వేలంతో మరో రూ.వెయ్యి కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. సెప్టెంబరు నుంచి కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.
గనుల శాఖలో నిఘా, అమలు విభాగం పటిష్టంగా ఉండాలి. గనులశాఖలో ఆదాయానికి గండి పడకుండా చూడాలి. వర్షాలు వచ్చేలోగా 79 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉంచాలి. వర్షాల వల్ల ఇసుక రీచ్‌లు మునిగే పరిస్థితి రాకూడదు.- సీఎం జగన్
పారదర్శకతతో మైనింగ్ కార్యకలాపాలు..
రాష్ట్రంలో మైనింగ్ శాఖలో పలు సంస్కరణలకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. భూగర్భ గనుల శాఖ ద్వారా పూర్తి పారదర్శకతతో మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆ దిశలో పలు సంస్కరణలకు సీఎం ఆమోదముద్ర వేశారు. ఇకపై రాష్ట్రంలో మైనర్ మినరల్స్‌ను ఈ-ఆక్షన్ ద్వారా వేలం నిర్వహిస్తాం. గతంలో మాదిరిగా మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత అనే విధానాన్ని నిలిపివేస్తున్నాం. ఈ-ఆక్షన్ ద్వారానే వేలం ప్రక్రియ కొనసాగుతుంది. ఇకపై గ్రానైట్ మైనింగ్‌లో సైజ్ (వాల్యూమెట్రిక్ బేసిస్)తో సంబంధం లేకుండా బరువు ఆధారంగా సీనరేజ్ని నిర్ణయిస్తాం. దీనివల్ల కనీసం 35 నుంచి 40 శాతం సీనరేజీ ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఆగస్టు నుంచి ఈ విధానం అమలులోకి రాబోతుంది.-మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఇదీ చదవండీ... జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆసుపత్రుల అభివృద్ధి: సీఎం