ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్ ప్రక్రియను, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మూడో టీఎంసీ సహా ఏడు ప్రాజెక్టు పనులను ఆపాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సూచించారు. కృష్ణా బేసిన్లో ఆంధ్రప్రదేశ్, గోదావరి బేసిన్లో తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుల్లో పరస్పరం రెండు రాష్ట్రాలు ఫిర్యాదు చేసుకొన్న వాటిని ఆపాలని కోరారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టులను చేపట్టవద్దని పేర్కొన్నారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు.
జల వివాదాలు, గోదావరి, కృష్ణా నీటి పంపకాలు, కొత్త ప్రాజెక్టులపై........ చర్చించేందుకు అత్యవసరంగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని.... కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్...... తెలుగు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్... ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే సమావేశమైందని ఆయన గుర్తుచేశారు. ఈనెల 5న భేటీకి నిర్ణయించినా.. ముందస్తు కార్యక్రమాల కారణంగా తెలంగాణ సీఎం... 20 తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని కోరారని... లేఖలో షెకావత్ పేర్కొన్నారు. కానీ ఆ తేదీపై ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి స్పందన లేదని... మంత్రి తెలిపారు. అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించాల్సిన విషయాలపై.. అజెండా అంశాలు ఇవ్వాలని గతేడాది సెప్టెంబర్‌లో కోరితే ఒక్కరూ స్పందించలేదని.. అసంతృప్తి వ్యక్తం చేశారు.
కృష్ణా, గోదావరి బోర్డుల సూచన మేరకు మంత్రిత్వ శాఖనే 4 అంశాలను.. ఖరారు చేసిందని లేఖలో షెకావత్ ప్రస్తావించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి.. రోజుకు 6 నుంచి 8 టీఎంసీల నీటిని వాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్ నిర్మాణాలు చేపడుతోందని.... తెలంగాణ పిర్యాదు చేసినట్లు సీఎం జగన్‌కు రాసిన లేఖలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న నిర్మాణాలపై.. డీపీఆర్ ఇవ్వాలని కృష్ణా బోర్డు ఆదేశించినా... ఇప్పటి వరకు అందించలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇటీవల ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచినట్లు... తనకు సమాచారం వచ్చినట్లు లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ అభ్యంతరాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగించవద్దని.. ముఖ్యమంత్రి జగన్‌కు రాసిన లేఖలో షెకావత్ తెలిపారు. అపెక్స్ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి కార్యకాలపాలు చేపట్టవద్దని... టెండర్ల ప్రక్రియ కూడా నిలిపివేయాలని ముఖ్యమంత్రి జగన్‌కు సూచించారు.
ఏపీ అభ్యంతరాలపై కేసీఆర్‌కు లేఖ
గోదావరి నదిపై విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ...తెలంగాణ ఏడు ప్రాజెక్టులు నిర్మిస్తోందని, ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు వ్యక్తం చేసిందని......... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కాళేశ్వరం, గోదావరి ఎత్తిపోతల పథకం 3వ దశ, సీతారామ ఎత్తిపోతల, తుపాకులగూడెం, తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టు, లోయర్ పెన్‌గంగపై బ్యారేజిల నిర్మాణం, రామప్ప నుంచి పాకాల మళ్లింపు వంటి ప్రాజెక్టులు... రాష్ట్ర విభజన చట్టానికి విరుద్దంగా నిర్మిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈఏడాది మేలో అభ్యంతరాలు తెలిపిందని షెకావత్ ప్రస్తావించారు. 2018 జూన్‌లో ఇచ్చిన... అనుమతులకు విరుద్దంగా, డీపీఆర్ ఆమోదం లేకుండా.. కాళేశ్వరం ద్వారా రోజుకు 2 టీఎంసీల తరలింపు సామర్థ్యాన్ని మూడు టీఎంసీలకు పెంచుతూ నిర్మాణం చేపట్టారని.... ఏపీ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, డీపీఆర్‌లు అందించాలని... ఈ ఏడాది జూన్ 5న జరిగిన బోర్డు సమావేశంలో గోదావరి బోర్డు ఛైర్మన్ ఆదేశించినా.. ఇప్పటివరకు ఎటువంటి వివరాలు ఇవ్వలేదని అధికారులు తనకు చెప్పినట్లు షెకావత్ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో..... ఇకపై ముందుకు సాగవద్దని షెకావత్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా ముందుకు సాగడం.. మంచిది కాదన్నారు. పరస్పరం ఫిర్యాదులు, వివాదాల నేపథ్యంలో ఈనెలలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిపేందుకు ముందుకు రావాలని... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులకు వేర్వేరుగా రాసిన లేఖల్లో కేంద్ర మంత్రి కోరారు.
ఇదీ చదవండి...
సీఆర్డీఏపై హైకోర్టు స్టే వెకేట్ చేయాలని సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్