అతివేగం, నిర్లక్ష్యం వల్లే సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం జరిగినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు. సాయిధరమ్ తేజ్‌కు కార్లు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్సు ఉందని మాదాపూర్ డీసీపీ అన్నారు. ద్విచక్రవాహన లైసెన్స్‌పై వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
నిన్న ప్రమాదం జరిగిన రోడ్డులో వేగపరిమితి 30కి.మీ. మాత్రమేనని డీసీపీ తెలిపారు. తీగల వంతెనపై సాయిధరమ్ తేజ్ బైక్ 100కి.మీల వేగంతో వెళ్లినట్లు డీసీపీ వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో ద్విచక్రవాహనం 75కి.మీ. వేగంతో ఉన్నట్లు పేర్కొన్నారు.
దుర్గం చెరువు తీగల వంతెన నుంచి ఐకియా మీదుగా గచ్చిబౌలి వెళ్లే దారిలో వేగ పరిమితికి సంబంధించి తగిన బోర్డులు ఏర్పాటు చేసినట్లు మాదాపూర్ డీసీపీ తెలిపారు. మాదాపూర్ జోన్ పరిధిలో రహదారి ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జోన్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 17917 ద్విచక్ర వాహనాలపై పరిమితికి మించి వేగంతో వెళ్లినందుకు జరిమానా విధించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 5495 ద్విచక్ర వాహనదారులపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు డీసీపీ వివరించారు.
ఇదీ చూడండి: సాయితేజ్ ప్రమాదంపై నరేశ్ వ్యాఖ్యలు సరికాదు: శ్రీకాంత్