భారతదేశ అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి సంస్థ... కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్). స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ సంస్థ పరిధిలో దేశవ్యాప్తంగా 38 పరిశోధన ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి. కరోనా వైరస్ చికిత్సకు అవసరమయ్యే ఔషధాల తయారీ మొదలు, నిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్లు, వైద్యుల రక్షణ పరికరాల వరకు ఒక్కో ల్యాబ్‌లో పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ నివారణకు ప్రపంచంలో ఎక్కడైనా ఔషధం కనుగొంటే.. దాన్ని ఇక్కడ తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం మనకు ఉందని చెబుతున్నారు సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్‌మండే.
- కరోనా మహమ్మారిపై పోరులో సీఎస్‌ఐఆర్ ఎలాంటి వ్యూహాన్ని అవలంబిస్తోంది?
వైరస్‌కు సంబంధించి జన్యుపరమైన అంశాలను అర్థం చేసుకుని, నివారణ పద్ధతులను అభివృద్ధి చేయడం ప్రధానమైంది. వేగంగా, చౌకగా రోగ నిర్ధారణ కోసం, వైరస్ ప్రారంభ దశలోనే గుర్తించేందుకు డీఎన్‌ఏ ఆధారిత కిట్ల తయారీ, వైరస్ రాకుండా టీకా తయారీ, కొవిడ్-19ను నయం చేసే కొత్త చికిత్సలు, ఔషధాల తయారీపై దృష్టి పెట్టాం. వెంటిలేటర్ల వంటి పరికరాల తయారీని బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించాం. ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫాంపై ఉత్పత్తి చేసేలా చర్యలు చేపట్టాం. మొత్తంగా సీఎస్‌ఐఆర్ అయిదంచెల వ్యూహాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. వివిధ రాష్ట్రాల్లోని సొంత ప్రయోగశాలలతో పాటు, అనేక విద్యాసంస్థలు, పరిశ్రమలతో కలిసి పనిచేస్తోంది. అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి రోజూ సాయంత్రం పరిస్థితులను సమీక్షిస్తుంది. ప్రయోగశాలలు, పారిశ్రామిక సంస్థలతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నాం.
- ‘కరోనా’ నివారణ ఔషధం తయారీ ప్రస్తుతం ఏ దశలో ఉంది?
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇతర వ్యాధులకు వాడే ఔషధాలనే కరోనా వైరస్ నివారణకు ఉపయోగిస్తున్నారు. సీఎస్‌ఐఆర్‌కు సంబంధించి హైదరాబాద్‌లోని ఐఐసీటీ, పుణెలోని ఎన్‌సీఎల్, లఖ్‌నవూలోని సీడీఆర్‌ఐ ప్రధానంగా ఔషధ ఫార్ములా తయారీపై పనిచేస్తున్నాయి. కరోనా వైరస్‌పై సమర్థంగా పనిచేస్తున్న ఔషధాన్ని ప్రపంచంలో ఎక్కడైనా కనుగొన్నా, ఇతర విధానంలో ఆ ఔషధాన్ని భారత్‌లో తయారు చేసే సాంకేతికత మన వద్ద ఉంది. ఔషధం తయారు కాగానే పరిశ్రమలతో కలిసి భారత మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
- కిట్ల కొరత తీవ్రంగా ఉంది. సీసీఎంబీ అభివృద్ధి చేస్తున్న కిట్ ఎప్పటికి రానుంది?
సీసీఎంబీతో పాటు ఐజీఐబీ తదితర సంస్థలు వేగవంతమైన, చౌకైన కిట్ల తయారీపై పనిచేస్తున్నాయి. ఆర్‌టీ-పీసీఆర్, రక్తంలోని సీరం, యాంటీబాడీ ఆధారిత నిర్ధారణ పరీక్షల కిట్లను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా సీసీఎంబీలో ఔషధ పరీక్షలు, ఇతర ప్రయోగాల కోసం వైరల్ కల్చర్ కూడా చేస్తున్నాం.
- కాగితం ఆధారిత కిట్ల తయారీ ఏ దశలో ఉంది?
దిల్లీలోని ఐజీఐబీ సంస్థ కాగితం ఆధారిత డయాగ్నస్టిక్ కిట్లను అభివృద్ధి చేస్తోంది. ఇది వస్తే చాలా వేగంగా, తక్కువ ఖర్చులో నిర్ధారణ పరీక్షలు చేయవచ్చు. సాధారణ పీసీఆర్ యంత్రాలపైన, చిన్న ప్రయోగశాలల్లోనూ పరీక్షించవచ్చు. దీని ద్వారా దేశవ్యాప్తంగా నిర్ధారణ పరీక్షలు చేసే కేంద్రాల సంఖ్య పెరుగుతుంది.
- కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో వ్యూహాల్లో మార్పులు అవసరమని భావిస్తున్నారా?
మరిన్ని ఎక్కువ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వీలుగా కిట్ల అభివృద్ధి, వైద్యుల రక్షణ కోసం పీపీఈలు, ఔషధాల తయారీని వేగవంతం చేయాలి. లాక్‌డౌన్‌లో కార్మికులు ఎక్కువగా ఊళ్లకు వెళ్లినందున గ్రామీణ సాంకేతికతలను, ఔత్సాహికవేత్తలను ప్రోత్సహించడం ప్రధానమైంది.
ఇదీ చదవండి...