ఈనెల 19న(ఆదివారం) జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీపీఓలు, జడ్పీసీఈవోలతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించడంతో పాటు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
'శాంతి భద్రతల పర్యవేక్షణకు అదనపు బలగాలు'
కౌంటింగ్ కేంద్రాల వద్ద పర్యవేక్షణకు జిల్లా అధికారిని ఇన్ఛార్జ్గా నియమించాలని.. కలెక్టర్లను ఆదేశించారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎమైనా సందేహాలుంటే వాటిని నివృత్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంతోపాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా సిద్ధంగా ఉంటారని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల పర్యవేక్షణకు అదనపు బలగాలను వినియోగిస్తున్నట్టు శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు. కేంద్రాల్లో నిరంతర సీసీ టీవీ నిఘా పర్యవేక్షణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: AYYANNA PATRUDU: చంద్రబాబును చంపేందుకు యత్నం: మాజీ మంత్రి అయ్యన్న