లాక్‌డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కూలీల్లో ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఉపాధి దొరకని వారు మాత్రమే రాష్ట్రానికి తిరిగి రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. వలస కూలీలు ఒకేసారి పెద్ద సంఖ్యలో తరలివస్తే రాష్ట్ర సరిహద్దుల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా, తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతో రాష్ట్ర అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని ఆమె వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుని, తిరిగి రావాలనుకుంటున్న వలస కూలీల్ని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి, రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు.
వ్యక్తిగత దూరం పాటించాకే.. మద్యం అమ్మకాలు జరపాలి: మద్యం కొనుగోళ్ల సందర్భంగా ప్రజలు వ్యక్తిగత దూరం పాటించకపోతే దుకాణాలను మూసేసి.. నిబంధనలు పాటించిన తర్వాతే తిరిగి అమ్మకాలు చేపట్టాలని సంబంధిత యజమానులను నీలం సాహ్ని ఆదేశించారు. మద్యం దుకాణాల వద్ద ఐదుగురికి మించకుండా ఆబ్కారీ, పోలీసు శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి : విద్యుత్తు బిల్లుల షాక్!