అన్ని శాఖల మహిళా ఉద్యోగులకు ఏడాదికి 5 రోజుల ప్రత్యేక సెలవు దినాల అమలుకు కృషి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ హామీ ఇచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలోని సీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎస్ మాట్లాడారు. వేతన సవరణ సంఘం నివేదికను త్వరలో అందజేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఏప్రిల్‌లో జాయింట్ కౌన్సిల్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై శాఖలతో మాట్లాడి తక్షణమే పరిష్కరిస్తానని చెప్పారు. ఇప్పటికే సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడంపై కమిటీలు ఏర్పాటు చేశామని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్ వివరించారు.
సీపీఎస్ రద్దు చేయాలి
సీపీఎస్‌ను రద్దు చేయాలని, పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నాయకులు సీఎస్‌తోపాటు ప్రభుత్వ సలహాదారులను కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సకాలంలో పింఛను, ఇతర ప్రయోజనాలు అందించాలన్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ కాలాన్ని 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టాలని ఏపీటీఎఫ్ ప్రతినిధులు కోరారు. సచివాలయంలో అదనపు పోస్టులు మంజూరు చేయాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కోరారు. సమావేశంలో పలుశాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతోపాటు ఏపీ ఎన్జీవో సంఘం నుంచి చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ తరపున బొప్పరాజు వెంకటేశ్వర్లు, సచివాలయ సంఘం ప్రతినిధి ప్రసాద్, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు, యూటీఎఫ్ సంయుక్త కార్యదర్శి పి.బాబురెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జోసఫ్ సుధీర్‌బాబు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గోపాలకృష్ణ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, అంతర్గత వాణిజ్యంపై సీఎస్ సమీక్ష