కృష్ణా, గోదావరి వరదలతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. వ్యవసాయ, ఉద్యానశాఖల ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 93 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. పూర్తిస్థాయిలో పంటనష్టం గణన పూర్తయితే ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 23,700 ఎకరాల్లో ఉద్యాన పంటలు నీట మునిగాయి. రూ.178 కోట్ల మేర పంట నష్టం రైతులకు ఎదురైంది. వీరిలో అధికశాతం మంది ఎకరా, రెండెకరాలు సాగు చేసే రైతులే.
అరటి రైతుకే రూ.106 కోట్ల నష్టం
గోదావరి ముంచెత్తడంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటల రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. పంటలు ఇప్పటికీ నీటిలోనే నానుతున్నాయి. 11 వేల మందికి చెందిన 12వేల ఎకరాల అరటితోటలు నీటమునిగాయి. కూరగాయల రైతులూ నిండా మునిగారు. రూ.38 కోట్ల విలువైన పంటలను కోల్పోయినట్లు అంచనా. 8 వేల ఎకరాల్లో కూరగాయ పంటలు, వెయ్యి ఎకరాల్లో ఉల్లి, 540 ఎకరాల్లో బత్తాయి, 615 ఎకరాల్లో పూలతోటలు, 90 ఎకరాల్లో మిరప, పసుపు, బొప్పాయితో పాటు వివిధ పంటలు దెబ్బతిన్నాయి.
నీటిలో నానుతున్న వరి:
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 20 వేల ఎకరాల్లోని పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఇందులో 18 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో వరి దెబ్బతింది. 1,500 ఎకరాలపైగా విస్తీర్ణంలో పత్తి, మొక్కజొన్న, వేరుసెనగ కూడా నీట మునిగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మండలాల పరిధిలోని 65 గ్రామాల్లో పంటనష్టం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 27 మండలాల్లో 109 గ్రామాల పరిధిలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరదల కారణంగా కర్నూలు, కృష్ణా, విశాఖపట్నం, కడప, నెల్లూరు జిల్లాల్లోనూ పంటనష్టం జరిగిందని అధికారులు గుర్తించారు. ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా 69,500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేశారు.
ఇదీ చదవండి: