నాలుగు నెలల నుంచి రైతు కంటిపై కునుకు కరవైంది. ఆగస్టు నుంచి నవంబరు వరకూ రైతులు ఆకాశం వంక చూస్తూ ఆందోళనతోనే గడిపారు. వరస విపత్తులు విరుచుకుపడ్డాయి. వానలు, వరదలు, తుపానులంటూ దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. ఖరీఫ్‌నుంచి ఇప్పటివరకూ ఏకంగా 37 లక్షల ఎకరాల్లో పంట నష్టమైనట్లు అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. కౌలు సంగతి అటుంచి.. పెట్టుబడి కింద ఎకరాకు సగటున రూ.20వేలు లెక్కించినా రూ.7,400 కోట్లు వర్షార్పణమయ్యాయి.
అధికారిక గణాంకాల పరిధిలోకి రాని నష్టం ఇంకా ఉంది. భారీ వర్షాలతో పత్తిలో దిగుబడులు తగ్గిపోవడం, వైరస్ బారిన పడటంతో మిరప తొలగించడం.. తదితర దెబ్బలతోపాటు కౌలు మొత్తాన్నీ పరిగణనలోకి తీసుకుంటే నష్ట తీవ్రత భారీగా ఉంటుంది.
దెబ్బతీసిన వరుస విపత్తులు
ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షాల ప్రభావం అధికంగానే ఉన్నా ఆగస్టు నుంచి పెరిగింది. వాయుగుండాలతో గుక్కతిప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులకు వరదలు పోటెత్తాయి.
* నవంబరు 20న అల్పపీడనంగా మొదలై తీవ్ర తుపానుగా మారిన నివర్ రాష్ట్రంలో విలయమే సృష్టించింది. పుదుచ్చేరిలో తీరం దాటినా.. రాష్ట్రంలో చిత్తూరు నుంచి తూర్పుగోదావరి వరకు ఎడతెరపిలేని వానలు కురిపించింది. 24 గంటల్లోనే 30 సెం.మీ. వర్షం నమోదైంది.
భారీగా పంటనష్టం
ఆగస్టు నుంచి అక్టోబరు వరకు కురిసిన వర్షాలు, ముంచెత్తిన వరదలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. చిత్తూరు మినహా అన్ని జిల్లాల్లోనూ పంటనష్టం తలెత్తింది. వారం, పది రోజులకుపైగా నీరు నిలవడంతో ఉభయగోదావరి జిల్లాల్లో గడ్డిపరక కూడా చేతికందని దుస్థితి నెలకొంది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 14 లక్షల ఎకరాలకుపైగా వేరుసెనగ దెబ్బతింది. పంట నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రం బృందం రాష్ట్రంలో పర్యటించింది.
* నివర్ తుపానుతో 17.33 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశామని వ్యవసాయమంత్రి కన్నబాబు అసెంబ్లీలో ప్రకటించడం నష్ట తీవ్రతకు దర్పణం పడుతోంది. ఇందులో సుమారు 10 లక్షల ఎకరాల వరకు.. కోత కోసిన, కోతకొచ్చిన వరి పంట నీట మునిగింది.
* మొత్తంగా చూస్తే ఆగస్టు నుంచి నవంబరు వరకు కురిసిన వర్షాలతో 13.33 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 3.30 లక్షల ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. తూర్పుగోదావరిలో 2.64 లక్షలు, కృష్ణాలో 2.60 లక్షలు, పశ్చిమగోదావరిలో 1.77 లక్షల ఎకరాల్లో వరి వేసిన రైతులు పెద్దఎత్తున నష్టపోయారు. కొంతమంది కోయడమే దండగ అని పొలాల్లోనే వదిలేస్తున్నారు.
ఇదీ చదవండి