అమరావతి రైతులకు, రాజధాని గ్రామాల్లో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ చట్టబద్ధంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ.. సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రైతులు, రైతు కూలీలతో కలిసి తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని ప్రయత్నించారు. అయితే అమరావతి రైతులు ధర్నాకు వస్తే.. అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. దీంతో తుళ్లూరు శిబిరం నుంచి సీపీఎం నేతలు, రైతు కూలీలు.. సీఆర్డీఏ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రతినిధి బృందాన్ని లోపలికి పంపిస్తామని చెప్పిన పోలీసులు.. గేటు వద్ద మరో సారి అడ్డుకున్నారు. దీంతో సీపీఎం నేతలు, రైతు కూలీలు గేటు వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. వారందరిని పోలీసులు అరెస్టు చేసి తుళ్లూరు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల వైఖరిని, ప్రభుత్వ తీరును సీపీఎం నేతలు ఖండించారు.
ప్రభుత్వం వైఖరితో తాము రెండున్నరేళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని.. రైతు కూలీలు ఆరోపించారు. తమకు అండగా నిలిచేందుకు వచ్చిన సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేయడాన్ని వారు తప్పుబట్టారు. గత ప్రభుత్వంలో తమకు 2 వేల 500 రూపాయల పింఛన్ వచ్చేదని.. దానిని నిలిపివేశారని మహిళా కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. టిడ్కో గృహాల కోసం 50 వేల నుంచి లక్ష రూపాయల మేర కట్టించుకున్నారని.. ఇప్పటి వరకు ఇళ్లు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్య నేతల్ని అరెస్టు చేసిన తర్వాత పోలీసులు సీపీఎం ప్రతినిధి బృందాన్ని లోపలకు అనుమతించారు. వారు సీఆర్డీఏ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సీపీఎం నేతలు, దళిత ఐకాస నేతలు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఆందోళనకు దిగారు. రాజధాని ప్రజల సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే పోలీసులు అడ్డుకోవటాన్ని వారు తప్పుబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీసు స్టేషన్ ప్రాంగణంలోనే నినాదాలు చేశారు. రాజధాని అభివృద్ధి విషయంలో ప్రభుత్వ వైఖరిని సీపీఎం, దళిత ఐకాస నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు.
అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభించటం, రైతులకు కేటాయించిన ప్లాట్ల వద్ద మౌళిక వసతులు కల్పించటం సహా మొత్తం 11 డిమాండ్లు నెరవేర్చాలని సీపీఎం ఆందోళన చేపట్టింది.
ఇదీ చదవండి