Cotton seeds: పత్తిలో రైతులు ఆసక్తి చూపే విత్తన రకాలపై ధరలు పెంచుతూ వ్యాపారులు దండుకుంటున్నారు. బీటీ విత్తన ప్యాకెట్‌పై ఎమ్మార్పీకంటే రూ.400 నుంచి రూ.500 వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాల విత్తనాలు అమ్ముతున్నామంటున్నా రైతులు కోరుతున్న రకాలు అందుబాటులో ఉండటం లేదు. సంబంధిత కంపెనీల నుంచీ అవసరమైనవి ఆర్‌బీకేలకు రావడం లేదు.
పత్తికి ధర బాగుండటంతో ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో వేసేందుకు రైతులు మొగ్గు చూపిస్తున్నారు. ఖరీఫ్‌లో 15.37 లక్షల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా. వాస్తవ విస్తీర్ణం 18 లక్షల ఎకరాలకు చేరే అవకాశముందని చెబుతున్నారు. 4, 5 రోజులుగా కొన్ని ప్రాంతాల్లో వానలు అనుకూలిస్తుండటంతో రైతులు విత్తన కొనుగోలుపై దృష్టి సారించారు.
అడ్వాన్సు కడితేనే ఆర్‌బీకేల్లో.. బీటీ-2 రకం పత్తి విత్తన ధర రూ.810గా నిర్ణయించారు. కొన్ని రకాలకున్న డిమాండ్‌నుబట్టి వ్యాపారులు రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కొన్ని రకాల విత్తనాల ప్యాకెట్ ధర రూ.1300 చొప్పున ఉంది. రైతులు దుకాణాలకు వెళితే డబ్బు ఇచ్చి వెంటనే విత్తనం తెచ్చుకోవచ్చు.
రైతు భరోసా కేంద్రాల్లో అడ్వాన్సుగా చెల్లించి నమోదు చేసుకోవాలి. 1, 2 రోజుల్లో తెప్పించి ఇస్తారు. వాటిలోనూ మార్కెట్లో గిరాకీ ఉన్న విత్తన రకాలు ఉండటం లేదు. ఆర్‌బీకేలు తెప్పించి ఇచ్చేలోగా పదును ఆరిపోతే విత్తనం వేసే పరిస్థితి ఉండదు. అప్పటికప్పుడు నగదు చెల్లించి విత్తనం కొనుక్కునేలా ఆర్‌బీకేల్లో ఏర్పాట్లు లేవు.
పత్తికి పెట్టుబడి ఎక్కువే.. పత్తి సాగుకు పెట్టుబడి ఏటికేడాది పెరుగుతోంది. సగటున ఎకరాకు రూ.35వేలపైనే ఖర్చవుతోంది. కౌలు రూపంలోనే ఎకరాకు రూ.10వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. విత్తనాలకు రూ.3వేల వరకు ఖర్చవుతున్నాయి. సేద్యం ఖర్చులు, విత్తనాలు వేయడం, కలుపుతీత, ఎరువులు, పురుగు మందులు అన్నీ కలిపితే రూ.20వేల వరకయ్యే అవకాశముంది. పత్తి తీత ఖర్చూ ఎక్కువే.
వాతావరణం అనుకూలించి ఎకరానికి సగటున 6 క్వింటాళ్ల దిగుబడి వస్తే మద్దతు ధర క్వింటా రూ.6,380 లెక్కన రూ.38,280 వస్తాయి. అంటే ఇంచుమించు పెట్టుబడులకు సమానమవుతుంది. వర్షాల వల్ల పంట దెబ్బతిన్నా, గులాబీ పురుగు ఉద్ధృతి పెరిగినా అదీ చేతికొచ్చే పరిస్థితి ఉండదు.
తగ్గుతున్న మార్కెట్ ధర.. వేసవిలో ఆదోని మార్కెట్‌లో క్వింటా పత్తి గరిష్ఠంగా రూ.13వేలకు పైగా పలికింది. ఇప్పుడు గరిష్ఠంగా క్వింటా రూ.10,850 ఉంది. సగటున క్వింటా రూ.10వేలు ఉంది. పత్తి సీజన్ మొదలయ్యే నాటికి ఎంత ఉంటుందనే ప్రశ్నలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఇవీ చూడండి: