విజయవాడలో పురపోరు.. విమర్శలు, ప్రతివిమర్శలతో వేడెక్కింది. 54వ డివిజన్‌లో మంత్రి వెల్లంపల్లి, 57, 59లో కొడాలి నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 31వ డివిజన్ లో మాజీ ఎమ్మెల్యే బోండా, 10 వ డివిజన్ లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కేశినేని నానిలు ఎన్నికల ప్రచారం చేశారు. 41 వ డివిజన్‌లో వామపక్షాలు బలపరిచిన అభ్యర్థి తరఫున ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రచారం చేశారు. పెడనలో వైకాపానే పాగా వేస‌్తుందని.. ఎమ్మెల్యే జోగి రమేశ్ అన్నారు. నందిగామ, పెనమూలూరులో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని తెదేపా నేతలు దేవినేని, బోడెప్రసాద్ కోరారు. ఎన్నికల్లో తెదేపా గెలిస్తే.. అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
జీవీఎంసీ పీఠం కోసం అభ్యర్థులు హోరాహోరీగా కసరత్తులు చేస్తున్నారు. విశాఖ ప్రజలకు అభివృద్ధి కావాలా లేక 3 రాజధానులు కావాలా అనే విషయం తేల్చుకోవడానికి ఈ ఎన్నికలు రెఫరెండంగా నిలవనున్నాయని తెదేపా నేత బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. పెందుర్తిలో సీపీఐ అభ్యర్థుల తరఫున సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రచారం చేశారు. రానున్న ఎన్నికలలో నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పని చేయాలని పాయకరావుపేటలో అయ్యన్న పాత్రుడు కోరారు.
రాజ్యాంగ విలువలను నిలువునా ఖూనీ చేస్తూ.. పిడుగురాళ్ల, మాచర్ల లో ఏకగ్రీవాలు అప్రజాస్వామికమని నరసరావుపేట తెదేపా నేత జీవీ ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు 23, 45 వ డివిజన్‌లో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ప్రచారం నిర్వహించారు. వైకాపాకు మరో అవకాశమిస్తే పన్నుల ఊభిలోకి నెట్టేస్తుందని, ప్రజలు ఆచితూచి ఓటేయాలని కాంగ్రెస్ నేత మస్తాన్ వలి అన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎన్నికల మేనిఫెస్టోను ఎమ్మెల్యే గొట్టిపాటి విడుదల చేశారు.
రాయలసీమ జిల్లాలోనూ ప్రధాన పార్టీలు ఎత్తుకు పై ఎత్తులతో ప్రచారాలు చేస్తున్నారు. అనంతపురంలో అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి కృషి చేస్తున్నారు. కల్యాణదుర్గం అన్ని వార్డులోనూ తెదేపా పోటీలో నిలబడటమే తమ విజయని నేతలు ధీమా వ్యక్తం చేశారు. హిందూపురంలో బాలయ్య ప్రచారానికి తెదేపా కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. కర్నూలులో అభ్యర్థుల తరఫున పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఆదోనిలో ఎన్నికల అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా ఓటర్ల లిస్టును తయారు చేశారని.. వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.
పురపాలక ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలంటూ గుంటూరులో ఓటర్ల చైతన్య ర్యాలీని కలెక్టర్ వివేక్ యాదవ్ నిర్వహించారు. కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీలో వివిధ పార్టీలు సమర్పించిన బి-ఫారం పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లా పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు. మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో .. పంపిణీకి కోసం ఉంచిన నిత్యవసర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుడూరులో అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేయగా.. 200 లీటర్ల ఐడి వాష్, 20 లీటర్ల నాటుసారా లభ్యమైంది. ఏడుగురిపై బైండోవర్ కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: