తెలంగాణాలో కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన బియ్యం, నగదు పంపిణీ ఎలా చేయాలనే విషయమై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పేద కుటుంబాల్లో ఒక్కొక్క వ్యక్తికి ఉచితంగా 12 కిలోల బియ్యం, ఇతర సరకుల కొనుగోలుకు ఒక్కో కుటుంబానికి రూ.1500 చెల్లిస్తామని సీఎం ప్రకటించారు. బియ్యంతో పాటు కొన్ని రకాల సరకులను కూడా ఇవ్వాలని అధికారులు యోచించినా, సాధ్యాసాధ్యాలను పరిశీలించాక నగదు రూపంలో ఇవ్వడమే మంచిదన్న అభిప్రాయానికి తెలంగాణా ప్రభుత్వం వచ్చింది.
నిల్వలు పుష్కలం
కార్డుదారులకు ఇచ్చేందుకు సుమారు 14 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం గోదాముల్లో ఉన్నట్లు అధికారులు నిర్ధరించారు. ప్రస్తుతం కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి తెలంగాణా ప్రభుత్వం ఆరు కిలోల బియ్యం ఇస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఒక్కో వ్యక్తికి ఎనిమిది కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని అధికారులు తొలుత భావించారు. నిల్వలు సమృద్ధిగా ఉండటంతో కనీసం రెండు నెలలకు సరిపడా 12 కిలోలు ఇవ్వాల్సిందిగా తెలంగాణా ముఖ్యమంత్రి ఆదేశించటంతో 3.36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరిపోతాయని అధికారులు లెక్కలు కట్టారు. రాష్ట్రంలో ఉన్న 87.59 లక్షల కార్డుల్లో ఎంత మంది కుటుంబసభ్యులు ఉన్నారన్న లెక్కలు అధికారుల వద్ద ఉన్నాయి. కార్డుదారుల ఇళ్లకే పంపాలంటే బియ్యాన్ని ప్యాక్ చేయడం సాధ్యమవుతుందా అని మల్లగుల్లాలు పడుతున్నారు. రేషన్ దుకాణాల్లోనే పంపిణీ చేయడం మేలన్న అభిప్రాయం అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. దీనిపై నేడు స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
నగదుగానా? బ్యాంకుల ద్వారానా?
తెలంగాణా సీఎం ప్రకటించిన రూ.1500 నగదు రూపంలో ఇవ్వడమా? కార్డుదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడమా? అనే విషయంలోనూ నేడు స్పష్టత వస్తుందని ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. కార్డుదారుల బ్యాంకు ఖాతాల వివరాలను పౌరసరఫరాల శాఖ గతంలో సేకరించింది. ఆ ఖాతాలు చెల్లుబాటులో ఉన్నాయా? లేదా? లాక్‌డౌన్ నేపథ్యంలో బ్యాంకుల్లో సిబ్బంది తక్కువగా ఉంటే ప్రజలకు సమస్య అవుతుందా? సొమ్ము కోసం బ్యాంకుల వద్ద ప్రజలు అధిక సంఖ్యలో చేరితే ఇబ్బందికరం కదా... అనే విషయాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఇవీ చూడండి: వీడియో: ఏకతాటిపైకి ఆంధ్రా జనం... ఊరూవాడా నిశ్శబ్దం