* హైదరాబాద్ లోని ఎల్బీనగర్‌కు చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్‌కు కరోనా సోకడంతో వారం రోజుల కిందట కింగ్‌కోఠి ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే అతని ఆక్సిజన్ స్థాయి 75 శాతానికి పడిపోయింది. పెరగడం లేదు. శుక్రవారం నుంచి అతడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఫోన్‌లో అవతలి వ్యక్తి ఎక్కడున్నావని అడిగితే ‘ఎల్బీనగర్‌లో ఉన్నాను... ఇంటికి కూరగాయలు తీసుకెళ్తున్నా’ అని సమాధానం ఇచ్చాడు. అందరితోనూ ఇలానే మాట్లాడుతున్నాడు.
* కూకట్‌పల్లికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కొవిడ్‌తో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వారం రోజులుగా మానసిక స్థితిలో మార్పు వచ్చింది. తెలుగు వ్యక్తి అయినా.. తరచూ హిందీలో మాట్లాడుతున్నారు. తన ఊరు ఝార్ఖండ్ అని చెబుతున్నారని వైద్యులు తెలిపారు.
గతంలో మానసిక ఒత్తిడికి గురైన చరిత్ర ఉన్న రోగులపై ఈ మహమ్మారి మరింత ఆందోళన పెంచుతోందని వివరిస్తున్నారు. కొంతమందిలో ఆక్సిజన్ శాతం బాగున్నా కుటుంబం కోసం ఆందోళన చెందుతూ స్థిమితం తప్పినవారిలా మారిపోతున్నారని ప్రముఖ వైద్యుడు డాక్టర్ ముఖర్జీ తెలిపారు.
రకరకాల ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి
‘‘కరోనా ఉద్ధృతమవుతోంది.. నాకూ సోకుతుందేమో? అలా జరిగితే ఏ ఆసుపత్రిలో చేరాలి? ఐసీయూలో చేరిన తర్వాత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో? ఒకవేళ నాకేమైనా అయితే కుటుంబం పరిస్థితి ఏమిటి..’’ ఇలా రకరకాల ఆలోచనలతో చాలా మంది మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ‘‘ప్రస్తుతం చాలా ఆసుపత్రుల్లో పడకలు దొరక్కపోవడం.. ఆక్సిజన్ కొరత వేధిస్తుండటం.. ఐసీయూలో ఒంటరిగా ఉండాల్సి రావడం వంటి కారణాలతో జనం విపరీతమైన ఒత్తిళ్లకు లోనవుతున్నారు’’ అని ప్రముఖ మానసిక వైద్యురాలు డా.జ్యోతి తెలిపారు.
‘‘వైరస్ బారిన పడని వారు సైతం గత కొన్నాళ్లగా మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మా ఆసుపత్రికి వచ్చిన వారిలో 39 శాతం మంది వరకు ఇటువంటివారే ఉంటున్నారు. ఇదే సమయంలో కరోనా బారిన పడిన వారిలో మానసిక నియంత్రణ కోల్పోతున్న వారి సంఖ్య 50 శాతం వరకు ఉంటోంది. వ్యాధి తీవ్రతతో అవయవాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కొంతమంది స్థిమితం కోల్పోతున్నారు. ఇలాంటి వారికి కౌన్సెలింగ్ తప్పనిసరి’’ అని వివరించారు అపోలో ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ సాహిత.
అధ్యయనంలో తేలిందిలా....
కరోనా చికిత్స సమయంలో రోగుల్లో మానసిక క్షోభ 44.2 శాతం.. డిప్రెషన్ (నిరాశ) 5.5 శాతం.. ఆందోళన 3.2 శాతం.. అని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. మొత్తం 222 మంది రోగుల మానసిక స్థితిగతులను పరిశీలించిన అనంతరం వైద్యబృందం ఈ నివేదిక రూపొందించింది. ఇది నాలుగు రోజుల కిందట ఆర్కిస్ జర్నల్‌లో ప్రచురితమైంది. కరోనా సమయంలో సాధారణ ప్రజల్లోనూ మానసిక వేదన 74-80శాతం వరకు ఉంటోందని ఆ అధ్యయనం తేల్చింది.
రోగ నిరోధకశక్తిపై డిప్రెషన్ ప్రభావం
కరోనా బాధితులు డిప్రెషన్(నిరాశ)కు లోనైతే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే నిరాశ.. రోగ నిరోధక శక్తిని తగ్గిస్తోంది. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం, కేన్సర్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్.. తదితర దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘దీర్ఘకాలిక రోగులు రోజువారీ శారీరక వ్యాయామాలపై దృష్టి పెట్టాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయాలి. అయినా నిరాశ తగ్గకపోతే కౌన్సెలింగ్ తీసుకోవాలి. అప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోతే సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి చికిత్స పొందాలి’’ అని ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక చికిత్సాలయం సూపరింటెండెంట్ డా.ఉమాశంకర్ తెలిపారు. కౌన్సెలింగ్ అసరమైన వారు 98499 03006 నంబరుకు ఫోన్ చేసి మాట్లాడొచ్చని చెప్పారు.
ఇదీ చూడండి: ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్