న్యాయస్థానాలు ఏడాదిగా సాంకేతికత అండగా కక్షిదారులు, బాధితులకు న్యాయం అందించాయి. కరోనాతో లాక్‌డౌన్ విధించడం వల్ల గతేడాది మార్చి 23 నుంచి న్యాయస్థానాల్లో కేసుల విచారణకు తీవ్ర విఘాతం కలిగింది. హైకోర్టు ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలిస్తూ అత్యవసర వ్యాజ్యాలను న్యాయమూర్తులు, న్యాయాధికారులు ఇంటివద్ద నుంచే వీడియో సమావేశాల ద్వారా విచారించేందుకు వెసులుబాటు కల్పించింది. లాక్‌డౌన్ కాలంలో వీడియో సమావేశాల ద్వారా దేశంలో విచారణలు ప్రారంభించిన తొలి హైకోర్టు మనదే కావడం విశేషం.
మెగా లోక్‌అదాలత్‌లను నిర్వహించి కొంతమేర పెండింగ్ వ్యాజ్యాల్ని శీఘ్రంగా పరిష్కరించారు. న్యాయస్థానాలకు రాకుండానే వ్యాజ్యాల్ని ఆన్‌లైన్ ద్వారా దాఖలు చేసేందుకు వీలు కల్పించారు. వీడియో సమావేశాల ద్వారా న్యాయవాదులు వాదనలను వినిపించేందుకు సౌకర్యాలను కల్పించారు. దీనివల్ల దిల్లీ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి న్యాయవాదులు వాదనలను వినిపించేందుకు వీలు కలగడంతోపాటు సమయం, సొమ్ము ఆదా అయ్యాయి. క్రిమినల్ కేసుల్లో విచారణ సాఫీగా జరిగినా, సివిల్ కేసుల్లో ఆశించిన స్థాయిలో జరగలేదు. సాక్షులు న్యాయమూర్తుల ముందుకు వచ్చి సాక్ష్యాలు ఇచ్చే విధానానికి అవరోధం ఏర్పడింది.
రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాల్లో మాత్రమే న్యాయవాదులు నేరుగా, వీడియో సమావేశం (హైబ్రిడ్ విధానం) ద్వారా హైకోర్టు విచారణలను చేపట్టింది. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో కేవలం వీడియో సమావేశం ద్వారానే విచారణలు జరుగుతున్నాయి. కింది కోర్టుల్లో వీడియో సమావేశాలు, ఇరువైపు న్యాయవాదుల అంగీకారంతో నేరుగా విచారణలను నిర్వహిస్తున్నారు. విచారణ ప్రక్రియలో ఇంతటి సాంకేతిక మార్పులు చోటు చేసుకుని మార్చి 22కి ఏడాది పూర్తి అయింది. ఏప్రిల్ 9 వరకు ప్రస్తుత విధానంలో న్యాయస్థానాల్లో విచారణలు కొనసాగుతాయని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది.
పెరిగిన పెండింగ్ కేసులు
కరోనా కారణంగా న్యాయస్థాన విచారణలో మార్పులు చోటు చేసుకోవడంతో పెండింగ్ వ్యాజ్యాల సంఖ్య పెరిగిందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకున్న కొత్త తరం న్యాయవాదులు ఆన్‌లైన్ విచారణలను సద్వినియోగం చేసుకుంటున్నా పాతతరం వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కింది కోర్టుల్లో పాతతరం న్యాయవాదులు ఎక్కువగా ఉండటం, పూర్తి స్థాయిలో సాంకేతిక ఏర్పాట్లు లేకపోవడంతో వ్యాజ్యాల విచారణలో పురోగతి కనిపించడం లేదు.
ఇబ్బందుల్లో న్యాయవాదులు
ఏడాదిపాటు కోర్టుల విచారణపై ప్రభావం చూపడం ఇదే మొదటిసారి. దీంతో న్యాయవాదులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా న్యాయవాదుల గుమస్తాలపై తీవ్ర ప్రభావం పడింది. యువ న్యాయవాదులకు ప్రభుత్వం స్టైపండ్ చెల్లించడంతో కొంత ఉపశమనం కలిగింది. మరోవైపు వేసవి సెలవుల సమయంలో మూడేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న న్యాయాధికారుల్ని, సిబ్బందిని బదిలీ చేస్తారు. కరోనా కారణంగా ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని మార్చి నుంచి మే నెలకు మార్చింది. ఇప్పుడు బదిలీలు చేపడితే ఇబ్బందులు ఎదుర్కొంటామని న్యాయాధికారులు, న్యాయశాఖ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
* జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ ప్రకారం.. 2021 మార్చి 21 నాటికి ఏపీ హైకోర్టులో మొత్తం పెండింగ్ కేసులు 2,10,900. (1,79,673 సివిల్ కేసుల, 31,227 క్రిమినల్ కేసులు)
* ఏపీలోని కోర్టుల్లో మొత్తం పెండింగ్ కేసుల సంఖ్య 6,67,067. (సివిల్ కేసులు 3,66,718. క్రిమినల్ కేసులు 3,00,349)
ఇదీ చదవండీ... చీకుచింత: విద్యార్థులకు తప్పని తంటా..!