తెలంగాణలోని కరోనా వైరస్ విజృంభన జిల్లాలను హడలెత్తిస్తోంది. పట్టణాలు, గ్రామాల్లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పెద్దసంఖ్యలో కేసులు పెరుగుతుండటంతో పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్ విధిస్తున్నారు. GHMCలో అత్యధిక కొవిడ్ కేసులు నమోదవుతున్నా.... మిగిలిన జిల్లాల్లోనూ బాధితుల సంఖ్య వాయువేగంతో విస్తరిస్తోంది. అధిక జిల్లాల్లో వారంలోనే రెట్టింపు నుంచి అయిదింతలు కేసులు పెరిగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో... రంగారెడ్డి, మేడ్చల్ కంటే అధికంగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. తక్కువ కేసులు నమోదైన జిల్లాల్లోనూ..... అదే రీతిలో పెరుగుదల కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో పరీక్షలు చేసిన ప్రతి వెయ్యి మందిలో 200 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. 15 రోజుల క్రితం 23 పాజిటివ్‌లు నమోదు కాగా... ఇప్పుడా సంఖ్య 364కి పెరిగింది. మెదక్‌లో ఏప్రిల్‌లోనే అధికంగా 2వేల870 మందికి వైరస్ సోకింది. సిద్దిపేటలో 3 వేల కేసులు నమోదయ్యాయి.
ఎన్నికల ప్రచార ప్రభావం
నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచారం ప్రభావంతో... కొవిడ్ వ్యాప్తి బాగా పెరిగింది. నియోజకవర్గ పరిధిలోనే ఏప్రిల్‌లో 700 మందికిపైగా వైరస్ బారినపడ్డారు. యాదాద్రి జిల్లాలో రోజుకు 200 నుంచి 250 కేసులు నమోదవుతున్నాయి. ఏప్రిల్‌లో యాదాద్రి జిల్లాలో 3,200, నల్గొండ జిల్లాలో 3,600 కేసులు వెలుగుచూశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసులు నిర్ధరణఅవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో 30 నుంచి 40 మంది బాధితులున్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో 20 రోజుల్లోనే 372 కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా 12 గ్రామాల్లో... స్వచ్ఛంద లాక్‌డౌన్ విధించారు. జగిత్యాల జిల్లాల్లో మొత్తం 80కి పైగా గ్రామాల్లో స్వచ్ఛందంగా ఆంక్షలు విధించుకున్నారు.
ఆస్పత్రులకు రోగుల తాకిడి...
కరోనాతో ఆస్పత్రుల బారిన పడుతున్నవారి సంఖ్య భారీగానే పెరుగుతోంది. మహారాష్ట్రలోని ఆసుపత్రుల్లో పడకలు దొరక్కపోవడంతో... ఆ ప్రభావం నిజామాబాద్ జిల్లాపై పడుతోంది. ఇక్కడి ఆసుపత్రుల్లో ఎక్కువ మంది బాధితులు అక్కడివారే ఉన్నారు. 19 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స అందిస్తుండగా మరో 40 నుంచి 50 ఆసుపత్రులు అనుమతి కోసం దరఖాస్తు చేశాయి. వరంగల్‌లోనూ ఎంజీఎం ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. 440 కొవిడ్ పడకలున్న ఆ దవాఖానాకు ఈ నెల 2న 22న మంది రోగులుండగా... ఈనెల 20 నాటికి ఆ సంఖ్య 190కి పెరిగింది. కాకతీయ మెడికల్ కాలేజ్‌లో వైద్యుల కొరత ఉంది. ఆదిలాబాద్ రిమ్స్‌లో అనుమానితులు, నిర్ధారణ అయినవారికి, పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి... గతంలో వేర్వేరు వార్డులుండేవి. ఇప్పుడు ఒకే వార్డు ఉండటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో పడకలు వేగంగా నిండిపోతుంటంతో వాటి సంఖ్యను పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. కొందరికి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించాల్సి ఉన్నా సిలిండర్ల కొరతతో కొన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకలపైనే సర్దుబాటు చేస్తున్నారు.
ఒకే కుటుంబంలో ముగ్గురు బలి..
కరోనా బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరీంనగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని మహమ్మారి బలితీసుకుంది. ములుగు జిల్లా ఏటూరునాగారం నార్త్ రేంజ్ పరిధిలోని బానోజిబంధం బీట్ అధికారిగా పనిచేస్తున్న పద్మ కోవిడ్‌తో మృతిచెందారు. భద్రాద్రి జిల్లా మణుగూరు, పినపాక మండలంలో ముగ్గురు కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో మహిళ ఉద్యోగి మహమ్మారికి బలైంది.