రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల నమోదు ఆగడం లేదు. ఇప్పటివరకు 122 పాజిటివ్ బాధితులతో రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా గుంటూరు కొనసాగుతోంది. బాధితుల్లో ఇద్దర్ని డిశ్చార్జ్ చేశారు. 88 కేసులు గుంటూరు అర్బన్ ప్రాంతంలోనే నిర్ధారణ కావడంతో ఆంక్షలు కొనసాగుతున్నాయి. దిల్లీ మూలాలను దాదాపుగా అధికారులు చేధించారు. గుంటూరు గ్రామీణ పరిధిలో కొత్త కేసులు నమోదు అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. నరసరావుపేట, దాచేపల్లిలో కంటైన్మెంట్ ప్రాంతాలను ఉన్నతాధికారులు పరిశీలించారు. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో క్రిమిసంహారక టన్నెల్ ను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డితో కలిసి అధికారులు ప్రారంభించారు. గుంటూరులో ప్రైవేటు ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులుగా మారుస్తున్నట్లు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
కర్నూలు జిల్లాలో 113మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. బాధితుల్లో ఇద్దరు మృతి చెందగా.. ఒకరు డిశ్చార్జి అయ్యారు. కరోనాతో మృతి చెందిన ఓ ప్రైవేటు వైద్యుడి వద్ద వైద్యం పొందిన రోగులు, ఆసుపత్రికి వెళ్లివచ్చిన వారి బంధువులు, సిబ్బందిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. కర్నూలు నగరం సహా పొరుగునే ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి రోగులు ప్రైవేటు ఆసుపత్రికి వచ్చి వైద్యం పొందినట్లు అధికారులు గుర్తించారు. కేఎం ఆసుపత్రికి వచ్చిన వారంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని.... ఉచితంగా కరోనా టెస్టులు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ రిలిఫ్ ఫండ్ కోసం కర్నూలు జిల్లా పొదుపు మహిళలు 40 లక్షల రూపాయల చెక్‌ను కలెక్టర్‌కు అందచేశారు.
కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 48కి పెరిగాయి . గురువారం విజయవాడకు చెందిన మరో ముగ్గురికి కరోనా సోకగా... వీరిలో ఒక మహిళా వార్డు వాలంటీర్ కూడా ఉన్నారు. విజయవాడలోనే 40 పాజిటివ్ కేసులు ఇప్పటివరకూ నమోదయ్యాయి . పాజిటివ్ వచ్చిన రెడ్ జోన్ల పరిధిలో విస్తృతంగా నిర్ధరణ పరీక్షల కోసం శ్వాబ్ సేకరణ చేపడుతున్నారు . జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసుల్లో ఏడుగురికి మాత్రం ఎవరి నుంచి వైరస్ సోకిందనేది తెలియడం లేదు . జిల్లాలో ఇప్పటివరకూ నలుగురు ఆసుపత్రి నుంచి ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అయ్యారు . నలుగురు మృతి చెందారు.
ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకూ 42 కేసులు నమోదయ్యాయి. 582 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. రెడ్ జోన్ల పరిధిలో పూర్తిగా రాకపోకలను నియంత్రించారు. కడప జిల్లాలో 36 కరోనా కేసులు నమోదు కాగా...13 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో కేసుల సంఖ్య 34కు పెరిగింది. నిన్న 3 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 23 పాజిటివ్ కేసులు నమోదవగా ఒకరు చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. స్విమ్స్ వైద్యులు, సిబ్బంది ఒక్క రోజు వేతనాన్ని సీఎం సహాయనిధికి ఇచ్చారు. 15 లక్షల 66 వేల 646 రూపాయల చెక్కును తితిదే ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డికి అందించారు. అనంతపురం జిల్లాలో 21 మందికి కరోనా సోకగా...ఇద్దరు మృతిచెందారు. జిల్లాలో తొలి ఇద్దరు కరోనా బాధితులకు వ్యాధి నయమై ఇంటికి పంపినట్లు కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో 17 మంది కోవిడ్-19 పాజిటివ్ బాధితుల్లో ముగ్గురు కోలుకున్నారు. వీరిని జిల్లా కోవిడ్-19 ఆసుపత్రి జీఎస్ఎల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు ఆరుగురు పాజిటీవ్ కేసుల బాధితుల్ని చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. 11 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య నిలకడగా ఉంది. గత 6 రోజులుగా ఎలాంటి పెరుగుదల నమోదు కాలేదు.
ఇవీ చదవండి: '3 నెలలు గడువిస్తాం..స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఉంటారా..?'