తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో మరణాల శాతం(0.51) తక్కువగానే ఉన్నా... ఈ సంఖ్య క్రమేపీ పైపైకి ఎగబాకుతోంది. శనివారం నాటి మరణాలతో కలిపితే రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1,824కు పెరిగింది. కరోనా తొలిదశలో గత ఏడాది ఆగస్టు 25న 3,018 కేసులు నమోదవ్వడమే అత్యధికం. కానీ రెండోదశలో వైరస్ అతి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈనెలలో 3 వేల సంఖ్యను దాటేసింది. తాజాగా ఒక్కరోజే 5 వేలను అధిగమించింది. కేవలం 16 రోజుల్లోనే కేసులు 1000 నుంచి 5 వేలకు పెరిగిపోయాయి. కేవలం 16 రోజుల సమయం తీసుకుంది. ఈనెల 2న 1,078 నమోదవ్వగా.. ఈనెల 17న 5,093కు చేరుకుంది. ‘డబుల్ మ్యూటెంట్’ వైరస్‌గా నిపుణులు అంచనా వేస్తుండడంతో.. ఇదే తీరుగా కొనసాగితే మరో రెండువారాల్లోనే ఒక్కరోజులో 10 వేల సంఖ్యను దాటే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తాజా కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం 3,51,424 కొవిడ్ కేసులు నమోదు కాగా, ఇందులో ఎలాంటి లక్షణాలు లేనివారు 80.5 శాతం మంది, లక్షణాలతో కరోనా నిర్ధారణ అయినవారు 19.5 శాతం మంది ఉన్నారు. వీరిలోనూ అత్యధికంగా 21-40 ఏళ్ల మధ్యవయస్కుల్లో 43.2 శాతం మంది ఉన్నారు.
జిల్లాల్లో తగ్గని ఉద్ధృతి
జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వైరస్ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. తాజా ఫలితాల్లో 19 జిల్లాల్లో ఒక్కరోజులోనే 100కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీలో 743, మేడ్చల్ మల్కాజిగిరి 488, రంగారెడ్డి 407, నిజామాబాద్ 367, సంగారెడ్డి 232, కామారెడ్డి 232, జగిత్యాల 223, వరంగల్ నగర జిల్లా 175, మహబూబ్‌నగర్ 168, ఖమ్మం 155, కరీంనగర్ 149, నల్గొండ 139, నిర్మల్ 139, మంచిర్యాల 124, వికారాబాద్ 122, సిద్దిపేట 117, రాజన్న సిరిసిల్ల 106, మెదక్ 101, నాగర్‌కర్నూల్‌లో 101 కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.
ఒక్కరోజులో 1.50 లక్షల డోసుల పంపిణీ
రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 1,50,464 కొవిడ్ టీకాలను పంపిణీ చేశారు. ఇందులో ప్రభుత్వ వైద్యంలో 1,147 కేంద్రాల్లో 1,31,230 డోసులు కాగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో 225 కేంద్రాల్లో 11,904 డోసులను అందజేశారు. తాజా పంపిణీలో 1,39,994 మంది తొలిడోసును, 10,470 మంది రెండోడోసును స్వీకరించారు. మొత్తంగా 25,91,962 మంది తొలిడోసును, 3,60,312 మంది రెండోడోసును పొందినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. టీకా వృథా కేవలం 0.57 శాతంగా నమోదైనట్లు పేర్కొన్నారు.
88 శాతానికి తగ్గిన రికవరీ
రాష్ట్రంలో మరో 1,555 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ఇప్పటివరకూ 3,12,563 మంది చికిత్స పొంది ఆరోగ్యవంతులయ్యారు. మొత్తం పాజిటివ్‌ల్లో కోలుకున్నవారి శాతం తాజాగా 88.94గా నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 37,037 మంది వైరస్‌తో చికిత్స పొందుతుండగా, వీరిలో 24,156 మంది ఐసొలేషన్‌లో వైద్యసేవల్లో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం 1,29,637 నమూనాలను పరీక్షించారు.
ఏపీలో 6,582 కేసులు.. 22 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ తీవ్రమవుతోంది. 24 గంటల వ్యవధిలో పరీక్షించిన వారిలో 18.23 శాతం మందికి కొవిడ్ ఉన్నట్లు నిర్ధారణైంది. శనివారం ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 9 మధ్య 35,922 నమూనాల్ని పరీక్షించగా. 6,582 మందికి కొవిడ్ ఉన్నట్లు తేలింది. 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
* తమిళనాడులో ఆదివారం 10,723 కరోనా కేసులు, 42 మరణాలు నమోదయ్యాయి. మంగళవారం నుంచి రాష్ట్రంలో రాత్రి వేళ, ఆదివారాల్లో పూర్తిస్థాయి కర్ఫ్యూ అమలవుతుందని ప్రకటించారు.
* కర్ణాటకలో ఆదివారం కరోనాతో 81 మంది చనిపోయారు. ఒక్కరోజులో 19,067 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: