రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ అధికారులు నివారణ చర్యలు చేపడుతున్నారు. కొవిడ్ మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. కరోనా కట్టడికి చాలా జిల్లాలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైరస్ దరి చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్లు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని సూచిస్తున్నారు.
చర్యలు తప్పవు..
కరోనా నియంత్రణ చర్యలకు ప్రజలు సహకరించకుంటే లాక్‌డౌన్ ముప్పు తప్పదని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. హనుమాన్ జంక్షన్ పోలీసుల ఆధ్వర్యంలో కరోనా నియంత్రణ చర్యలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. గతంలో విధించిన లాక్‌డౌన్ సమయంలో అన్నివర్గాల వారు పోలీస్ శాఖకు సహకరించినట్లే ఇప్పుడూ సహకారాన్ని అందించాలని కోరారు. పోలీసులు విధించిన కరోనా నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. నిబంధనలు పాటించకపోతే జరిమానా విధించడం, దుకాణాలను శాశ్వతంగా మూసివేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
రెండు గంటల వరకే దుకాణాలు..
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. బయట తిరగడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. మంగళవారం నుంచి అన్ని దుకాణాలకు మధ్యాహ్నం రెండు గంటల వరకే అధికారులు అనుమతి ఇచ్చారు. గుంపులుగా తిరగవద్దని.. మాస్కులు ధరించాలని పట్టణ కమిషనర్ ఓబులేసు కోరారు.
ప్రజలను చైతన్య పరిచే గోడపత్రిక ఆవిష్కరణ..
కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా పెరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అప్పారి సూర్యనారాయణ కోరారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ బెల్లంపూడికి చెందిన శ్రీ మహాలక్ష్మీ సేవా ఫౌండేషన్ ముద్రించిన గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం వైద్య సిబ్బందికి, రోగులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మృత్యుంజయరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆరోగ్య కార్యకర్తలందరికీ వాక్సిన్..
కర్నూలు జిల్లాలో ఆరోగ్య కార్యకర్తలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నామని.. కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. ఇప్పటివరకు 3.5 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని.. మిగిలిన 37 వేల మందికి సోమవారం వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం సర్వజన వైద్యశాలలో కర్నూలు కొవిడ్ ప్రత్యేకాధికారి సాయిప్రసాద్, వీరపాండియన్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో వ్యాక్సిన్ కొరత లేదని కలెక్టర్ పేర్కొన్నారు.
నియంత్రణ చర్యలు చేపట్టండి..
కరోనా మహమ్మారి నియంత్రణలో అప్రమత్తంగా ఉండి ప్రజలను కాపాడాలని చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అన్ని శాఖల అధికారులకు సూచించారు. కురబలకోటలో సోమవారం అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రజలు కూడా నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.
బ్యాంక్ సిబ్బందికి కరోనా..
కర్నూలు జిల్లా ఆదోనిలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులకు కరోనా నిర్ధారణ అయ్యింది. పట్టణంలోని ప్రధాన స్టేట్ బ్యాంకులో ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది.. కార్యాలయం మొత్తాన్ని శానిటైజ్ చేయించారు. ఆదోనిలో సోమవారం ఒక్కరోజే 78 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
ఇదీ చదవండి: