తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తిపోతల ఫలితంగా బీడు భూముల్లో జలసవ్వడులు వినిపిస్తున్నాయి. ఎటుచూసిన జలసిరులు తారసపడుతున్నాయి. మోటార్ల నుంచి ఉవ్వెత్తున ఎగసిపడుతున్న జలాలను చూసి రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (kaleshwaram lift irrigation project) నుంచి.. నంది మేడారం మీదుగా నీటి తరలింపు నిరాటంకంగా కొనసాగుతోంది. ఎస్సారెస్పీ, మధ్యమానేరు, దిగువమానేరు జలాశయాలతో పాటు ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలను నింపాలనే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం నుంచి జలాల ఎత్తిపోతల ప్రక్రియ వారం రోజులుగా నిర్విరామంగా కొనసాగుతోంది. ఆరు మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో గత బుధవారం... నంది పంపుహౌస్‌లో (nandi pump house) రెండు మోటార్లను ఆన్ చేశారు. అనంతరం మోటార్ల సంఖ్యను క్రమంగా పెంచుతూ వచ్చారు. గురువారం ఆరో మోటార్‌ను నడిపిస్తున్నారు. ఫలితంగా ఎల్లంపల్లి జలాశయం నుంచి 18,900 క్యూసెక్కుల ప్రవాహం నంది మేడారం జలాశయంలోకి చేరుతోంది. నందిమేడారం రిజర్వాయర్‌లో (nandi medaram reservoir) 229.5 మీటర్ల నీటిమట్టం స్థిరంగా ఉండేలా చూస్తూ గాయత్రి పంపుహౌస్‌కు జలాలను విడిచిపెడుతున్నారు. అక్కడి నుంచి ఆరు మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్నారు. వరద కాలువ ద్వారా మధ్యమానేరుకు, అక్కడి నుంచి దిగువ మానేరుకు తరలిస్తున్నారు.
పోచారంలోకి చేరుతున్న వరద నీరు
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మంచిప్ప, గాంధారి అటవీ ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి నీరు ఏరులై పారుతోంది. ఆ నీరు లింగంపేట వాగు నుంచి పోచారం జలాశయంలోకి వచ్చి చేరుతుంది.
ఇదీచూడండి:
SEC: నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ఉపసంహరణ