రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని.. సమయస్ఫూర్తితో వ్యవహరించి అతని ప్రాణాలను రక్షించిన కరీంనగర్ ఒకటో ఠాణా కానిస్టేబుల్ ఎం.ఎ.ఖలీల్‌ను... ట్విటర్ ద్వారా రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. బొమ్మకల్‌కు చెందిన ఎం.డి.అబ్దుల్ ఖాన్ మంగళవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుతున్న క్రమంలో వేగంగా వచ్చిన ద్విచక్రవాహనదారుడు అబ్దుల్‌ఖాన్‌ను ఢీకొట్టడంతో గాయపడి ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు.
అక్కడే విధులు నిర్వహిస్తున్న ఖలీల్ పరిశీలించగా యువకుడి గుండె ఆగిపోయింది. దీంతో సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్ సీపీఆర్ ప్రథమ చికిత్స చేశారు. నిముషం పాటు యువకుడి గుండెపై తన చేతులతో వత్తిడి పెంచాడు. ఆగిన గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది. అనంతరం వెంటనే అంబులెన్స్‌లో యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ఖలీల్ చేసిన చికిత్స స్థానికులను అబ్బురపరిచింది.
ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పరిశీలించిన తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి... ఖలీల్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడమే కాకుండా, బాధితుని ప్రాణాలను రక్షించారంటూ ట్విటర్ ద్వారా అభినందించారు. ఈ విషయంపై కానిస్టేబుల్ ఖలీల్ చేసిన మంచి పనిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి సూచించారు. ఖలీల్‌ను సీపీ తన కార్యాలయంలో సన్మానించి వెయ్యి రూపాయలు నగదు రివార్డు అందించి అభినందించారు. విధి నిర్వహణలో ఓ మనిషి ప్రాణాలను రక్షించినందుకు హైదరాబాద్ ఎయిమ్స్ వైద్యులు ఎన్.సి.కె.రెడ్డి ఖలీల్‌కు రూ.3వేల నగదు అందించారు.
ఇదీ చదవండి:
మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రి వ్యవహారంపై హైకోర్టులో వ్యాజ్యం..