అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే నినాదంతో నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు నిర్వహించనున్న అమరావతి రైతుల మహాపాదయాత్రకు పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ సంఘీభావం ప్రకటించారు. "న్యాయస్థానం టూ దేవస్థానం" పేరుతో అమరావతి పరిరక్షణ సమితి నవంబరు 1 నుంచి తలపెట్టిన మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పాదయాత్రలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యా తలెత్తకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం డీజీపీని ఆదేశించడం హర్షణీయమన్నారు. సమస్యలపై నిరసన, ప్రదర్శన, పాదయాత్ర చేపట్టడం పౌరుల ప్రాథమిక హక్కులో భాగం అని పేర్కొన్నారు. ప్రజలకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం, శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకునే హక్కు ఉందని శైలజానాథ్ పేర్కొన్నారు. రైతుల పాదయాత్ర విషయంలో.. హైకోర్టు ఇచ్చిన తీర్పు సర్కారుకు చెంపపెట్టు లాంటిదన్నారు.
ఇదీ చదవండి: Jaggareddy: నేను సమైక్యవాదినే.. కేసీఆర్ అలా వస్తే మద్దతిస్తా: జగ్గారెడ్డి