తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కొనుగోలు(paddy procurement in telangana) అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే తెరాస, భాజపాలు పోటాపోటీగా ఆందోళనలు, నిరసనలు చేస్తూ హోరెత్తిస్తున్నాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తప్పు మీదంటే మీది అంటూ... విమర్శలకు పదును పెడుతున్నారు. తాజాగా ఇవాళ్టి నుంచి కాంగ్రెస్ నేతలు కూడా "కల్లాల్లోకి కాంగ్రెస్(kallalloki congress program)" నినాదంతో రంగంలోకి దిగుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదం వల్లనే నేడు రైతుల పరిస్థితులు దారుణంగా మారిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇన్ని రోజులు సమావేశాలు, మీడియా సమావేశాలకు పరిమితమైన కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో పర్యటనకు శ్రీకారం చుట్టింది.
భారీ నిరసన ప్రదర్శన..
నిన్న పబ్లిక్ గార్డెన్ దగ్గర నుంచి వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వరకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు భారీ నిరసన ప్రదర్శన చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy tpcc news) కేంద్ర, రాష్ట్ర సర్కార్ల వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. తెరాస, భాజపాలు రెండూ.. జాయింట్ యాక్టింగ్ కమిటీగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ధైర్యముంటే.. ఇప్పటికైనా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లాల వారిగా ఇంఛార్జులు...
ఇవాళ్టి నుంచి కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి అన్నదాతకు అండగా నిలవాలని ఆదేశించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. జిల్లాల వారీగా పార్టీ సీనియర్ నాయకులను ఇంఛార్టీలుగా నియమించారు. జహీరాబాద్లో పీఎస్సీ కన్వీనర్ కబీర్‌తో కలిసి రేవంత్ రెడ్డి ఇవాళ.. కల్లాల్లో పర్యటించనున్నారు మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య వరంగల్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు వేముల మహేందర్ రెడ్డి నాగర్ కర్నూల్, పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి మహబూబ్‌నగర్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి మల్కాజిగిరి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరీంనగర్, సీనియర్ నేతలు వి హనుమంత రావు పెద్దపల్లి, పీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలకు ఇంఛార్జులుగా నియమించారు. స్థానిక డీసీసీ అధ్యక్షులు, నేతలతోనూ కల్లాల్లో పర్యటించి రైతుల బాధలు తెలుసుకుని పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
రైతన్న మద్దతు ఎవరికో..
తెరాస, భాజపాల మధ్య నడుస్తున్న వడ్ల కొనుగోలు యుద్ధం కాంగ్రెస్ నేతల ఎంట్రీతో సరికొత్త రాజకీయ వేడి రాజుకోనుంది. ఇప్పటివరకు తెరాస, భాజపా నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుంటే.. హస్తం నేతలు ఆ రెండు పార్టీలను దోషులుగా చూపుతూ రైతు బాటపట్టారు. అన్నదాతల మద్దతు కోసం మూడు పార్టీలతో కొట్లాటలో రైతన్నల మద్దతు ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.
ఇదీ చూడండి: