తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నేడు జరగనున్న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్మించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పార్టీ నిర్ణయించింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సభ అయినందున.. అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున ఆదివాసీలు, గిరిజనులను తరలించేందుకు కృషి చేస్తున్నారు.
ఆ అంశాన్ని తెరపైకి..
ఇప్పటికే రాష్ట్ర స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు ఇంద్రవెల్లిలో మకాం వేసి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యే సీతక్క సభాస్థలాన్ని పరిశీలించడమే కాకుండా గ్రామాల్లో పర్యటించారు. ఇంద్రవెల్లి సమీపంలోని 18 నియోజకవర్గాలకు పార్టీ ముఖ్య నాయకులతోపాటు అనుబంధ సంఘాల నాయకులతో కమిటీలు వేసి సభ విజయవంతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. తెరాస సర్కారు ఎస్సీ కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదని.. అత్యధికంగా పోడు భూముల సమస్య ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎందుకు పరిష్కరించడం లేదనే అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నంలో ఇంద్రవెల్లిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
పార్టీకి దూరమైన వర్గాలను దగ్గర చేసుకుంటే..
సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే సభలో 2 గంటల వరకు స్థానిక నేతల ప్రసంగాలకు అవకాశం ఇచ్చి.. ఆ తర్వాత రాష్ట్ర నేతలతో ప్రసంగాలు ఉండేలా కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. సాయంత్రం 6 గంటల వరకు సభ జరిగే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క కలిసి పాల్గొనే సభ కూడా ఇదే ప్రథమం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీకి దూరమైన వర్గాలను దగ్గర చేసుకుంటే రాజకీయంగా కలిసి వస్తుందనే ఆలోచన కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. ఏడున్నరేళ్ల తెరాస పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు జరిగిన ప్రయోజనమేమీ లేదనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో క్రియాశీలకంగా ఉన్న పార్టీ శ్రేణులకు నైతికస్థైర్యం ఇవ్వడంతోపాటు ఉద్యోగ, ఉపాధికల్పన లేక అసంతృప్తితో ఉన్న యువత దృష్టిని ఆకర్షించేందుకు ఇంద్రవెల్లి సభ స్ఫూర్తితో కాంగ్రెస్ ముందుకు సాగే ప్రయత్నాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.
ఇంద్రవెల్లిలో ఐదో సభ
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి వేదికగా సోమవారం కాంగ్రెస్ నిర్వహిస్తున్న దళిత, గిరిజన దండోరా సభ ఐదవది. పార్టీ ఆధ్వర్యంలో 1981 ఏప్రిల్ 20న ఇక్కడే భారీగా మొదటి సభ జరిగింది. అనంతరం 1986, 1990, 1997లోనూ ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభలు నిర్వహించింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నేపథ్యంలో నేడు ఇదే వేదికగా సభ నిర్వహిస్తోంది. ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల నుంచి దళితులు, గిరిజనులను పెద్దఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేస్తోంది.
వచ్చే నెలలో రాష్ట్రానికి రాహుల్
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సెప్టెంబర్ మొదటివారంలో తెలంగాణకు వస్తారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సోమవారం నుంచి సెప్టెంబర్ 17 వరకు నిర్వహించనున్న కార్యక్రమాల్లో ఒకరోజు రాహుల్ పాల్గొంటారని అన్నారు. రేపటి నుంచి సెప్టెంబర్ 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. ‘ఇస్తవా...చస్తవా’ నినాదంతో ప్రభుత్వంపై ప్రజల తరఫున పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి దళిత, గిరిజన కుటుంబానికీ రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంద్రవెల్లి తరహాలో మరో నాలుగైదు ప్రాంతాల్లో బహిరంగ సభలు ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'సర్కారు వారి పాట' బ్లాస్టర్.. మహేశ్ లుక్స్ అదుర్స్