అధికార పార్టీ వైకాపాలో ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు లావాలా పెల్లుబుకుతున్నాయి. వర్గ విభేదాలు, కుమ్ములాటలు తీవ్రమవుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, వాగ్వాదాలు, సామాజిక మాధ్యమాల్లో మాటల యుద్ధాల స్థాయిని దాటి... హత్యల వరకు వెళ్లింది. ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో వైకాపా నాయకుడు గంజి నాగ ప్రసాద్‌ని అదే పార్టీకి చెందినవారు శనివారం దారుణంగా హత్య చేయడం, హత్య వెనుక స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలం ఉందంటూ, ఆయనపై దాడికి దిగడం దీనికి పరాకాష్ఠ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బయటపడిన కుమ్ములాటలు... ఇప్పుడు చాలాచోట్ల ముదిరిపాకాన పడ్డాయి. అధికార పార్టీ నాయకులు మంత్రుల ఎదుటే ముష్టి యుద్ధాలకు, బల ప్రదర్శనలకు దిగుతున్నారు. ఫ్లెక్సీలు చించుకుంటున్నారు. చెప్పులు విసురుకుంటున్నారు. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల సమావేశాల్లో బాహాబాహీకి దిగుతున్నారు.
సవాళ్లు చేసుకుంటున్నారు. ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్నచోట రెండు వర్గాలు ఉప్పు, నిప్పులా వ్యవహరిస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకులు వచ్చి చేరినచోట... వారికి, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవారికి మధ్య పొసగడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. వారిద్దరూ కలసి కార్యక్రమాల్లో పాల్గొనలేని పరిస్థితులున్నాయి. రిజర్వుడు నియోజకవర్గాల్లో తమ మాట చెల్లుబాటు కావట్లేదని అక్కడి శాసనసభ్యులు గుర్రుగా ఉన్నారు. శనివారం ఒక్క రోజే... పశ్చిమగోదావరి జిల్లాలో వైకాపా నాయకుడి హత్యతో పాటు, మరో మూడు చోట్ల వైకాపా నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదాలు, గొడవలు జరిగాయి. తెదేపా నుంచి వైకాపాలో చేరిన ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాలు బాహాబాహీకి దిగడంతో చీరాల పురపాలక సమావేశం రసాభాసగా మారింది. నంద్యాలలో ఆక్రమణల తొలగింపుపై కౌన్సిల్ సమావేశంలో వైస్‌ఛైర్మన్ పాంషావలి, కౌన్సిలర్ కృష్ణమోహన్... దాదాపు కొట్టుకున్నంత పనిచేశారు. ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడులో మంత్రి ఆదిమూలపు సురేష్ ఎదుటే వైకాపాలోని రెండు వర్గాలవారు వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
ప్రకాశం బాలినేని అడ్డా
ప్రకాశం జిల్లాలో మంత్రిగా ఉన్నా, లేకపోయినా అంతా తానే అన్నట్లుగా బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. జిల్లా నుంచి బాలినేని, సురేష్ ఇద్దరూ మంత్రులుగా ఉన్నప్పుడూ బాలినేని ఆధిపత్యమే ఉండేది. ఇప్పుడు బాలినేని మంత్రి కాకపోయినా జిల్లాలో ఆయన చెప్పినట్లే సాగుతుండటం మంత్రి సురేష్ వర్గీయులకు మింగుడుపడటం లేదు. ఈ విషయంలో మంత్రి సురేష్ తన అసంతృప్తిని సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఒక వర్గాన్ని ప్రోత్సహించినట్లయిందా?
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి విడదల రజని ఒక వర్గంగా, స్థానిక నేత మర్రి రాజశేఖర్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మరో వర్గంగా కొనసాగుతున్నారు. జనవరిలో పురుషోత్తపట్నంలో రాజశేఖర్ వర్గీయుడు బైరా కృష్ణ ఏర్పాటుచేసిన ప్రభ వద్దకు వెళ్లి వస్తుండగా ఎంపీ కారును మంత్రి మరిది విడదల గోపి, ఆయన మనుషులు అడ్డుకున్నారు. పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలను అక్కడ నుంచి పంపాల్సి వచ్చింది. ఎమ్మెల్యే వర్గీయులపై పోలీసులకు ఎంపీ ఫిర్యాదుచేశారు. చిరుమామిళ్లలోనూ ఇలాగే జరిగింది. రజనికి మంత్రి పదవి ఇవ్వడాన్ని ఎంపీ, ఇతర నేతలు వ్యతిరేకించారు. అయినా ఆమెకు పదవి దక్కడంతో పార్టీ అధిష్ఠానం ఒక వర్గాన్ని కావాలనే ప్రోత్సహించినట్లయిందా అన్న చర్చ మొదలైంది.
ఠాణాలో పరస్పర ఫిర్యాదులు
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ వర్గాల మధ్య పోరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జనవరిలో ఎమ్మెల్సీ రమేష్ పుట్టినరోజునాడు ఆయన అనుచరులు ప్రొద్దుటూరులో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే అనుచరులు చించేశారు. దీంతో ఎమ్మెల్యే అనుచరుడిపై ఎమ్మెల్సీ వర్గీయులు దాడి చేశారు. వీటిపై రెండు వర్గాల నేతలు పరస్పరం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
* వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుల మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. ఇటీవల శావల్యాపురంలో నరేంద్ర అనే రైతుపై ఎమ్మెల్యే పీఏ హత్యాయత్నం కేసు పెట్టిన విషయం తెలిసిందే. మల్లికార్జున ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నరేంద్ర అంగులు పీఏసీఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు.
* నగరి నియోజకవర్గంలో... గత ఏడాది డిసెంబరు 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే రోజా వ్యతిరేక వర్గమంతా పుత్తూరులో సమావేశమైంది. అక్కడ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలపై ఎమ్మెల్యే ఫొటోలు లేవు. తర్వాత ఆ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. దీంతో అసమ్మతి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రిజర్వుడు నియోజకవర్గాల్లోనూ రచ్చే
నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో జనవరిలో సచివాలయం, ఆర్బీకే వంటి వివిధ అభివృద్ధి పనులను అప్పటి ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న అనిల్‌కుమార్ యాదవ్ ఆ నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి సిద్దార్థరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాలతో పాటు మంత్రి పర్యటన సమాచారం ఏదీ స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్‌కు లేకపోవడం చర్చనీయాంశమైంది. ‘నా హక్కులకు భంగం కలిగినప్పుడు దీన్ని శాసనసభా హక్కుల ఉల్లంఘన కమిటీ దృష్టికి తీసుకువెళితే తప్పేంటి’ అనే భావనను ఎమ్మెల్యే ఆర్థర్ పలు టీవీ ఛానెళ్ల ఇంటర్వ్యూలలో వ్యక్తం చేశారు.
* పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు తన నియోజకవర్గంలో ఒక గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి ఒకచోట శంకుస్థాపన చేస్తే... అదే భవనాన్ని జిల్లా మంత్రులు పక్కనున్న మరో గ్రామానికి మార్చారంటున్నారు. ఇదే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎమ్మెల్యే తన కుమారుడితో సహా నలుగురితో జడ్పీటీసీ సభ్యులుగా నామినేషన్లు వేయిస్తే చివరికి అంబాజీపేటలో తప్ప మిగిలిన మూడు మండలాల్లోనూ అభ్యర్థులు మారిపోయారు. ఎమ్మెల్యే కుమారుడికి కూడా టికెట్ దక్కలేదు.
* కోడుమూరు, తాడికొండ, బద్వేలు వంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కంటే పార్టీ పెద్దల మాటే ఎక్కువగా చెల్లుబాటు అవుతోంది.
కొత్తవారొచ్చిన చోట కయ్యాల కాపురం
* చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నియోజకవర్గంలో 2019లో వైకాపా అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్ తన పట్టు నిరూపించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
* దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మధ్య వివాదం కొనసాగుతోంది. దర్శి మున్సిపాలిటీలో వైకాపా పరాజయానికి ఇదే కారణమని పార్టీలో చర్చ జరుగుతోంది.
* జమ్మలమడుగులో వైకాపాలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
* గన్నవరంలో వైకాపా సమన్వయకర్తగా యార్లగడ్డ వెంకట్రావు ఉన్నా.. ఆ పార్టీకి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అంతా తానై వ్యవహరిస్తున్నారు.
* రామచంద్రపురంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మధ్య వర్గపోరు ఉంది. గతేడాది ఆ ప్రాంత పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు ఆయన సమక్షంలోనే త్రిమూర్తులుపై వేణు వర్గీయులు చెప్పులువిసిరారు. తెదేపా నుంచి వచ్చిన త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఈ వివాదాలు మరింత పెరిగాయి.
ఉత్తరాంధ్రలో అసమ్మతి సెగ
పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఇటీవల పాయకరావుపేట మండలంలో పర్యటనకు వెళ్లగా... ఆయన్ను మండల వ్యవసాయ సలహామండలి అధ్యక్షుడు చిక్కాల రామచంద్ర తన అనుచరులతో అడ్డుకున్నారు. ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాల్లోనూ ఎమ్మెల్యేపై అసమ్మతి నెలకొంది. ఇప్పుడు బాబూరావుకు మంత్రివర్గంలో చోటు కూడా దక్కలేదు. దీంతో బాబూరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు
* ఎలమంచిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నబాబు రాజు, గవర కార్పొరేషన్ ఛైర్మన్ బొడ్డేడ ప్రసాద్ వర్గాలు ఇటీవల పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికల్లో కొన్నిచోట్లబాహాబాహీకి దిగాయి.
* నెల్లిమర్ల నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అప్పలనాయుడు నిలిపిన సర్పంచ్ అభ్యర్థులకు వ్యతిరేకంగా అయిదుచోట్ల మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు తన మద్దతుదారులను బరిలో నిలిపారు. మూడుచోట్ల గెలిపించుకున్నారు.
* శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును ఎంపీపీ ఎన్నికల సందర్భంగా వేపాడలో వైకాపా కార్యకర్తలే అడ్డుకున్నారు. చివరికి ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థి కాకుండా ఆయన వ్యతిరేక వర్గం అభ్యర్థే ఎంపీపీ పీఠాన్ని దక్కించుకున్నారు.
రోడ్డున పడ్డ ఎంపీ, ఎమ్మెల్యే వివాదం
రాజమమహేంద్రవరం నగరంపై పట్టు కోసం ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య పోరు నెలకొంది. గతంలో ఇళ్లపట్టాల కోసం రాజానగరంలో స్థానిక ఎమ్మెల్యే రాజాను సంప్రదించకుండా ఎంపీ ఒక స్థలాన్ని ఎంపిక చేయడంతో వివాదం రచ్చకెక్కింది.
* ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా మధ్య కూడా వర్గపోరు కొనసాగుతోంది. గతేడాది కామవరపుకోటలోని ఒకే పంచాయతీకి ఎంపీ, ఎమ్మెల్యే వేర్వేరు వ్యక్తులను సర్పంచి పదవికి బరిలో దించారు.
* మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను వ్యతిరేకిస్తున్న వైకాపా మండల అధ్యక్షుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, బీసీ నాయకుడు పామర్తి శ్రీనివాసరావు తన పదవులకు రాజీనామా చేశారు. మిగతా మండల పార్టీ అధ్యక్షులను గత ఏడాది డిసెంబరు 21న ఆహ్వానించి... కార్యక్రమంలో ఎమ్మెల్యే ఫొటో లేకుండా సీఎం జగన్ పుట్టినరోజును నిర్వహించారు. దీంతో నియోజకవర్గంలోని పార్టీ మండల కమిటీలన్నింటినీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ రద్దు చేశారు.
కోర్టు మెట్లెక్కిన సామాజిక మాధ్యమ యుద్ధం
పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్య, 2014లో అక్కడ వైకాపా తరఫున పోటీచేసిన రావి వెంకటరమణ వర్గాల మధ్య సామాజిక మాధ్యమాల్లో యుద్ధం జరిగింది. రావి వర్గీయులపై ఎమ్మెల్యే వర్గీయులు కేసు పెట్టగా... దాన్ని కొట్టేయాలంటూ రావి వర్గీయులు కోర్టుకు వెళ్లారు.
మంత్రివర్గ మంటలు..
మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణ వైకాపాలో అసంతృప్తి సెగను రాజేసింది. ఆత్మీయ సదస్సుల పేరిట ఒకరిద్దరు తాజా మాజీ మంత్రులు బల ప్రదర్శనకూ దిగారు. ‘ఆయన నాకు ఇచ్చిన సహకారం, చూపిన ప్రేమకు రెండింతలు ఇస్తా’ అంటూ అనిల్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో తనకున్న విభేదాలను చెప్పకనే చెప్పారు. నెల్లూరు జిల్లాలో గతంలో అనిల్ మంత్రిగా ఉన్నపుడు ఎమ్మెల్యే కాకాణి నియోజకవర్గంలోకి అధికారికంగా అడుగుపెట్టిన పరిస్థితి లేదు. వీరిద్దరి మధ్య విభేదాలే ఇందుకు కారణమనేది జిల్లాలో చర్చ. కాకాణి మంత్రి అయ్యాక.. జిల్లా కేంద్రం అనిల్ నియోజకవర్గమైన నెల్లూరు పట్టణానికి వస్తున్నందుకు స్వాగతం పలుకుతూ ఆయన (కాకాణి) అభిమానులు నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను కొందరు తొలగించడం, చించేయడంతో అది అనిల్ మనుషుల పనేనని పెద్ద రచ్చే జరిగింది. నెల్లూరులో కాకాణికి స్వాగతసభకు పోటీగా అనిల్ అత్మీయసభ అంటూ ఇంకోటి నిర్వహించుకున్నారు. చివరకు వీరిద్దరి పంచాయతీ ముఖ్యమంత్రి వద్దకు చేరింది. సీఎంతో భేటీ తర్వాత కాకాణి అనిల్ ఇంటికి వెళ్లి మాట్లాడినా, వీరిద్దరి మధ్య సఖ్యత కుదిరినట్లేనా అనే చర్చ ఇంకా ఉంది.
ఒక ఎమ్మెల్యే... అయిదు వైరి వర్గాలు
మంత్రి రోజాకు ఆమె నియోజకవర్గ నగరిలోని అయిదు మండలాల్లోనూ వ్యతిరేక వర్గాలున్నాయి. నగరిలో తమకు కనీస గుర్తింపు ఇవ్వడంలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గానికి చెందిన నగరి మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ కేజే కుమార్, ఆయన భార్య ఈడిగ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ శాంతి, వడమాలపేటలో ఎమ్మెల్యే సోదరుడు రామప్రసాద్‌రెడ్డి జోక్యం చేసుకుంటుండటంతో స్థానిక జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, విజయపురంలో చివరి నిమిషంలో ఎంపీపీ పదవి ఇవ్వకుండా ఆపేశారని లక్ష్మీపతి రాజు, కష్టపడి ఎంపీటీసీ సభ్యులను గెలిపించుకుంటే ఎంపీపీ పదవిని తన తమ్ముడికి ఇవ్వలేదని నిండ్రలో రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నిండ్రలో ఎంపీపీ ఎన్నిక సమయంలో ఎంపీపీ అభ్యర్థి భాస్కరరెడ్డి వర్గం, ఎమ్మెల్యే పరస్పరం విమర్శించుకోవడం, భాస్కరరెడ్డి వర్గీయులైన ఎంపీటీసీ సభ్యులతో పాటు ధర్నాకు దిగడంతో అప్పుడు ఎన్నిక వాయిదా పడింది. తర్వాత రోజా... పార్టీ అధినాయకత్వం మద్దతుతో భాస్కరరెడ్డిని కాకుండా దీప అనే మరో అభ్యర్థిని ఎంపీపీగా ఎంపికయ్యేలా చేశారు.
* మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్ది సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఉన్నారు. తంబళ్లపల్లె వైకాపా జడ్పీటీసీ సభ్యురాలు గీత భర్త కొండ్రెడ్డి... ఎమ్మెల్యేకి అసమ్మతివర్గంగా వ్యవహరిస్తున్నారు. ‘తంబళ్లపల్లెలో తాలిబన్ రాజ్యం నడుస్తోంది’ అంటూ ఇటీవల కొండ్రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గతంలో ఇళ్లపట్టాల విషయంలో కొందరిని మోసం చేశారంటూ కొండ్రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. కొండ్రెడ్డి ఇటీవల వైకాపాను వీడి తెదేపాలో చేరారు.
ఇదీ చదవండి: వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై.. సొంతపార్టీ నేతల దాడి!